తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ప్రక్రియకు గవర్నర్ తమిళిసై అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో, బిల్లుపై సంతకం పెట్టి పంపాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ను ముట్టడించారు. వేలాది మంది కార్మికులు రాజ్ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బిల్లులో అంశాలపై వివరణ సంగతి తర్వాత చూడొచ్చని, ముందు బిల్లుకు ఆమోదం తెలపాలని ఆందోళన చేస్తున్నారు.
దీంతో, పుదుచ్చేరిలో ఉన్న తమిళిసై…కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం జరగకూడదనే బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని అన్నారు. బిల్లులో 5 అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరగా…వివరణనిచ్చినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
కార్మికులు ఆందోళనకు దిగడం తనను బాధించిందని తమిళఇసై ట్వీట్ చేశారు. కార్మికులకు తాను వ్యతిరేకిని కాదని, ఈ ఆందోళనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాను అండగా నిలిచానని గుర్తు చేశారు. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండడంతో ప్రభుత్వం కీలక బిల్లులలకు ఆమోదం తెలిపేందుకు తొందరపడుతోంది. ఎన్నికలకు ముందు దాదాపు ఇవే చివర సమావేశాలు కావడంతో హడావిడి చేస్తోంది.