ప్రధాని నరేంద్ర మోడీ అంటే.. ఒక విధమైన గంభీరం తొణికిస లాడుతుంది. ఆయన ఏం మాట్లాడినా.. ఏ సబ్జెక్టు అందుకున్నా.. తిరుగులేదనే ప్రచారం కూడా ఉంది. పెద్ద నోట్లను రద్దుచేయడం ద్వారా దేశం అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా.. మోడీ భేష్ అనేలా ప్రచారం చేసుకున్నారు.
ఇక, కరోనా విషయంలో కేంద్రం తీసుకున్న నిర్లక్ష్య విధానాలతోనే ఇంత చనిపోయారంటూ.. మేధావి వర్గాలు ఆరోపించినా లెక్కచేయకుం డా.. మోడీ దూకుడుగానే వ్యవహరించారు. అయితే.. ఇప్పుడు ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు పరిశీలకులు. జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే.. జరగబోయే పరిణామాలు మరో రూపంలో ఉంటాయని మోడీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే ఆయన జమిలి జపం చేస్తున్నారని అంటున్నారు.
ప్రధానంగా ఇటీవల కాలంలో మోడీ తీసుకున్న విధానాలు దేశవ్యాప్తంగా మధ్యతరగతి వర్గాన్నిఇరుకున పెట్టిన మాట వాస్తవం. కరోనా సమయంలో ఉపాధి కోల్పోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, నిత్యావసర ధరలు పెరిగిపోవడం వంటివి మధ్య తరగతి వర్గాన్ని ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో వ్యతిరేకత పెరిగింది. ఇదే మరో మూడేళ్లపాటు కొనసాగితే.. బీజేపీ మార్కు పడిపోయే అవకాశం ఉంటుంది. దీని నుంచి పార్టీని ఒడ్డుకు చేర్చాలి. ఇక, మరో కీలక అంశం.. బీజేపీ వ్యూహం.. తన మాటే చెల్లాలి. ఈ దేశంలో తన మాటే శాసనం కావాలి. దేశంలో ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలకు అనుగుణమైన మార్పులు చూడాలి.. అనే వ్యూహంతో మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలోనే అనేక సంస్కరణలు(పేరుకే) తీసుకువచ్చి.. వాటిలో ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను జొప్పించారనే వాదన బలంగా ఉంది. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేసినా, వన్ నేషన్, వన్ రేషన్ వంటివి తీసుకువచ్చినా, ముస్లింల వివాహ చట్టాల్లోనూ జోక్యం చేసుకున్నా, పౌరసత్వ పట్టికలు మార్పు చేసినా.. సీఏఏ వంటివి తీసుకువచ్చినా.. వ్యూహం మాత్రంఆర్ ఎస్ ఎస్ విధానమే. ఈ క్రమంలోనే మోడీ.. ఇప్పుడు జమిలి జపం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
దేశంలో ఒకే సారి ఎన్నికలు తీసుకురావడం వల్ల ఒకే విధానాన్నిదేశంలో వ్యాపించి.. గుండుగుత్తుగా బీజేపీ లబ్ధి పొందే అవకాశం మెండుగా ఉంటుందనేది మేధావుల వాదన. నిజానికి జమిలి ఈనాటిది కాదని.. ఇదో విఫలమైన ప్రయోగమని అంటున్నారు.. మోడీ వినిపించుకోకపోవడం వెనుక ఖచ్చితంగా ఆర్ ఎస్ ఎస్ వాదమే ఉందని కుండబద్దలు కొడుతుండడం గమనార్హం.