నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు మొదలు బెయిల్ వరకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రఘురామను ఏపీలోని జైళ్లలో మగ్గేలా చేసి ప్రతీకారం తీర్చుకుందామని భావించిన జగన్ సర్కార్ కు….ఆర్ఆర్ఆర్ ఝలక్ ఇచ్చి తనకు గట్టిపట్టున్న హస్తినాపురికి చేరారని రాజుగారి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలువురు పోలీసులు, అధికారులపై కేంద్రానికి ఫిర్యాచేసిన రఘురామ ఢిల్లీ వేదికగా తన గేమ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్సింగ్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను త్వరగా డిశ్చార్జ్ చేయించేందుకు ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డితో కలిసి కుట్ర చేశారంటూ రఘురామ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసినా కూడా…తాను డిశ్చార్జి అయిన వెంటనే మళ్లీ గుంటూరుకు తీసుకెళ్లటం కోసం ఆసుపత్రి బయట 15 మంది పోలీసుల్ని అమ్మిరెడ్డి మోహరించి కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ఆ 15 మంది పోలీసులకు సంబంధించిన మెస్ బిల్లు, ఆధారాలు జతచేశారు. దీంతో, ఆ ఫిర్యాదు చేసిన రెండు రోజుల వ్యవధిలోనే అమ్మిరెడ్డికి షాక్ తగిలింది.
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని మంగళవారం నాడు ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మిరెడ్డి స్థానంలో గుంటూరు రూరల్ ఎస్ఈబీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న కె.అరీఫ్ హాఫీజ్ను నియమించింది. అంతేకాదు, అమ్మిరెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో, అమ్మిరెడ్డికి ఆర్ఆర్ఆర్ షాక్ ఇచ్చినట్టయింది.
మరో వారం, పది రోజుల్లో జరగనున్న ఐపీఎస్ల బదిలీల్లో అమ్మిరెడ్డిని కీలకమైన జిల్లాకు ఎస్పీగా పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రిందట సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చేతిలో ఉన్న ఒక అదనపు శాఖను కూడా …ఈ నేపథ్యంలో తాజాగా అసలు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విశేషం. దీంతో, ఎస్పీ అమ్మిరెడ్డి బదిలీ…ఆర్ఆర్ఆర్ తొలి విజయమా అంటూ రాజుగారి అభిమానుల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొదటి వికెట్ పడిందని, ఢిల్లీలోని టర్నింగ్ ట్రాక్ మీద ఆర్ఆర్ఆర్ వేసే గూగ్లీలకు ఏపీలో మరెన్ని వికెట్లు పడతాయోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.