ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు రోషన్ మేక. 2015లో `రుద్రమదేవి` సినిమాతో బాలనటుడిగా తొలిసారి వెండితెరపై మెరిసిన రోషన్.. 2021లో `పెళ్లి సందడి` మూవీతో సోలో హీరోగా మారాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఇదే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. రోషన్ మాత్రం కెరీర్ పరంగా స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `వృషభ` అనే తెలుగు, మలయాళం ద్విభాషా చిత్రంలో రోషన్ యాక్ట్ చేస్తున్నాడు. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ లో `ఛాంపియన్` అనే మరో చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉండగానే రోషన్ కు ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి వర్క్ చేసే బంపర్ ఛాన్స్ దక్కిందని ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు శైలేష్ కొలను.
`హిట్` సిరీస్ తో టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. తనదైన మేకింగ్ తో మోస్ట్ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. రీసెంట్ గా `హిట్ 3` సక్సెస్ అందుకున్న శైలేష్.. ఇప్పుడు రోషన్ మేకాతో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని సమాచారం. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించునున్నారని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే రోషన్ నక్క తోక తొక్కినట్లే అవుతుంది.