రాజకీయాల్లో ఒక్కొక్కసారి నేతలు చేసే వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతాయి. వారు పాజిటివ్ ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేసినా.. కూడా అవి నెగిటివ్ అయి తమకే గుచ్చుకుంటాయి. ఇప్పుడు ఏపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇదే తరహాలో వైసీపీకి సెగ పెడుతున్నాయి. రోజా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఇంతకీ రోజా ఏమన్నారంటే.. దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ రాని గొప్ప గొప్ప ఆలోచనలు సీఎం జగన్‌కే వస్తున్నాయని.. ఈ క్రమంలోనే ఆయన అనేక పథకాలు తీసుకువస్తున్నారని చెప్పారు. తాజాగా సీఎం జగన్ తీసుకువచ్చిన `జగనన్న ఆరోగ్య సురక్ష` పేదవాడికి అండగా నిలుస్తుందని రోజా పేర్కొన్నారు. నిండ్ర మండలం నెట్టేరి సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తాజాగా మంత్రి రోజా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే.. మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ రాని ఆలోచనలు అంటూ.. రోజా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు.. ఆసక్తిగా స్పందించారు. “ఔను.. మూడు రాజధానుల ఆలోచన ఎవరికి మాత్రం వస్తుంది“ అని ఒకరు.. “ఔను.. ప్రతిపక్ష నేత, 73 ఏళ్ల నాయకుడిని ఎలాంటి ఆధారం లేకుండా నిర్బంధించాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది“ అని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇంకొందరు చేసిన కామెంట్లలో రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమ రాకపోయినా.. పెట్రోలు ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నా.. బటన్ నొక్కడమే తన పని అని చెప్పుకొనే స్థాయి ఏ ముఖ్యమంత్రికి ఉంటుంది? అసలు ఈ ఆలోచన ఎవరికి మాత్రం వస్తుంది? అని ఒకింత ఘాటుగానే స్పందించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులను ఉద్ధరిస్తామని చెప్పిన మాటలు.. తుంగలో తొక్కి.. పంపకాలనే పరిమితం కావాలన్న ఆలోచన నిజంగానే ఏ ముఖ్యమంత్రి కి కూడా ఉండదు రోజా గారూ! అని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.