రెండు రోజులుగా ఏపీ రాజకీయం మంత్రి రోజా చుట్టూ తిరుగుతోంది. ఆమెను ఉద్దేశించి తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రోజా బ్లూ ఫిలిమ్స్‌లో నటించిందనడమే కాదు.. ఇంకా ఏవో ఆరోపణలు చేశారు బండారు. ఆయన వ్యాఖ్యల్ని కచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. అవతలున్నది రోజా అయినా మరొకరు అయినా.. ఒక మహిళ గురించి ఆయన ఇంత దారుణంగా మాట్లాడ్డం తప్పు. ఆయన్ని వెనకేసుకురావడం కూడా తప్పే. ఐతే ఈ వ్యవహారం మీద రామ్ గోపాల్ వర్మ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడం.. దాన్ని అనుసరించి బండారు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది. రోజా సైతం సానుభూతి రాబట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. మీడియా ముందు బండారు వ్యాఖ్యల వీడియోను ప్లే చేస్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆవేదన స్వరంతో మాట్లాడింది. కానీ రోజాకు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా ఆశించిన స్థాయిలో మద్దతు.. సానుభూతి రావట్లేదు. తటస్థులు బండారు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారే కానీ.. రోజా పట్ల మాత్రం సానుభూతితో మాట్లాడట్లేదు. అందుక్కారణం.. గతంలో పలు సందర్భాల్లో టీడీపీ, జనసేన నేతల్ని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలే. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఇలా చాలామంది విషయంలో ఆమె దారుణమైన భాష ఉపయోగించారు. మీడియా ముందు బూతులు ప్రయోగించారు. ఆమె నోటికి అడ్డు అదుపు ఉండదనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి.
ప్రత్యర్థి పార్టీల నేతలను హేళన చేసేలా ఆమె మాట్లాడిన మాటల తాలూకు వీడియోలు బోలెడు ఉన్నాయి. తనను మెగా అభిమానులు ఎవరో అన్నారని.. పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ ఎంతమందితో పడుకుంది అన్న కామెంట్ చేసిన ఘనురాలు రోజా. అలాగే పవన్ తన కుటుంబ సభ్యులను దూషించడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తే.. ‘‘మా అమ్మని తిట్టారు.. నా పెళ్లాన్ని తిట్టారు’’ అంటూ పవన్ సింపతీ గేమ్ ఆడుతున్నాడంటూ చాలా వెటకారంగా ఆమె మాట్లాడిన వీడియోలు కూడా ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇలాంటివన్నీ చూపించి.. రోజా ఇప్పుడొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే సానుభూతి వచ్చేస్తుందా అని నెటిజన్లు ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు.