వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా బుల్లితెర బాట పట్టారు. మళ్లీ ఫుల్ టైమ్ జడ్జిగా అలరించేందుకు రెడీ అయ్యారు. గతంలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే.. మోడ్రన్ మహాలక్ష్మి, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో రోజా స్మాల్ స్క్రీన్ పై సందడి చేశారు. ఎమ్మెల్యే అయిన కూడా టీవీ షోలను వీడలేదు. అయితే వైసీపీ హయాంలో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కడంతో.. బుల్లితెరపై కనిపించడం మానేశారు. పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు.
అయితే 2024 ఎన్నికల్లో కూటమి ధాటికి ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. నగరి నుంచి పోటీ చేసిన రోజా కూడా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయినపోయిన రోజా.. మళ్లీ ఇప్పుడిప్పుడే వైసీపీ తరఫున తన వాయిస్ వినిపిస్తున్నారు. అలాగే మరోవైపు స్మాల్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్-4కి సంబంధించి ఒక ఎపిసోడ్ లో మెరిసిన రోజా.. ఇప్పుడు అదే ఛానెల్లో ఫుల్ టైమ్ జడ్జిగా మారుతున్నారు.
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. సుడిగాలి సుధీర్ ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. అయితే జడ్జీలుగా ఆమని, రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కనిపించబోతున్నారు. తాజాగా ఈ షో ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రోమోను జీ తెలుగు వారు రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి గ్రాండ్ ఎంట్రీ, ఆమని మరియు రోజాల డ్యాన్సులు ప్రోమోలో అలరించాయి. అలాగే ఓపెనింగ్ ఎపిసోడ్ కు స్టార్ యాక్టర్ జగపతిబాబు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రస్తుతం డ్రామా జూనియర్స్ సీజన్ 8 ప్రోమో వైరల్ గా మారింది. మొత్తానికి బుల్లితెరపై రోజా రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.