సినిమాల నుంచి రాజకీయాల వైపు టర్న్ అయిన సినీ తారల్లో ఆర్కే రోజా ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా.. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత రాజకీయాల వైపు మొగ్గు చూపారు. అయితే పాలిటిక్స్ లోకి వచ్చాక సినిమాల్లో కనిపించకపోయినా బుల్లితెరపై రోజా సందడి చేశారు. ముఖ్యంగా ప్రముఖ కామెడీ షో `జబర్దస్త్` కు జడ్జ్ గా చాలా ఏళ్ల పాటు కొనసాగారు. అలాగే మరిన్ని టీవీ షోస్ లో భాగమయ్యారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కడంతో రోజా జబర్దస్త్ తో సహా టీవీ షూస్ చేయడం మానేశారు. బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యారు. నా జీవితం ప్రజలకే అంకితం అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా కూడా ఓటమి పాలయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చింది.
అప్పటినుంచి కాస్త సైలెంట్ అయిన రోజా లాంగ్ గ్యాప్ అనంరతం మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో `సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్` పేరుతో జీ తెలుగులో ఓ రియాల్టీ షో స్టార్ట్ అవుతోంది. ఈ షోకు హీరో శ్రీకాంత్, రాశి, రోజా జడ్జ్ గా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఈ షో లాంఛింగ్ ప్రోమో బయటకు వచ్చింది. ఈ ప్రోమోలో రోజా డాన్స్ చేస్తూ కనిపించింది. అలాగే హీరో శ్రీకాంత్ రోజాపై వేసిన సెటైర్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. ఇద్దరు సీనియర్ హీరోయిన్ల మధ్య నిలబడిన శ్రీకాంత్.. `ఈవిడ(రాశి) నవ్వితే ముత్యాలు రాలతాయి.. ఈవిడ (రోజా) దగ్గర ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలతాయి` అంటూ డైలాగ్ వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.