సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. గత వైకాపా ప్రభుత్వంలో నోటికి పని చెప్పిన మంత్రులకు కూటమి సర్కార్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్ వంటి నాయకులపై చర్యలు షురూ అయ్యాయి. ఇక నెక్స్ట్ టార్గెట్ వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మహిళా మంత్రి ఆర్కే రోజా అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. అంతకు తగ్గట్లుగానే ఆమె చుట్టూ ఉచ్చు బిగ్గుస్తోంది.
జగన్ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా రోజా వ్యవహరించారు. ఆ సమయంలో క్రీడలను ప్రోత్సహించేందుకంటూ రాష్ట్రవ్యాప్తంగా `ఆడుదాం ఆంధ్ర` కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు నెలల పాటు సాగిన ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు నిధులు వెచ్చించింది. అయితే ఇందులో భారీ అవినీతి జరిగిందని కూటమి నాయకులు ఆరోపణలు చేశారు. అలాగే గత ఐదేళ్లలో క్రీడాశాఖ చేపట్టిన అనేక కార్యక్రమాలపై అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్ తో పాటు మరికొందరు కోట్లాది రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
క్రీడాశాఖ లో జరిగిన అక్రమాలపై ఇప్పుడు ఏపీ సిఐడికి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఇటీవలె ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, అందుకు కారకులైన అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా, కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డీ ప్రసాద్ ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న సిఐడి.. విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశాలు జారీ చేసింది.