ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగా క్షీణించింది. లాలూ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, కోలుకోవటం కష్టమే అంటూ ఆయనకు వైద్యం అందిస్తున్న వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ ప్రకటించారు. రాంచీలోని రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో చికిత్స కోసం చేరిన లాలూ ఆరోగ్య పరిస్దితిపై రిమ్స్ వైద్యులకు ప్రసాద్ రాతమూలకంగా వివరించారు.
పశుదాణా కేసులో అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలు రుజువవ్వటంతో లాలూ కొన్ని సంవత్సరాలుగా జైలులోనే ఉన్నారు. ఆమధ్య అంటే బీహార్ ఎన్నికల సమయంలో లాలూకు బెయిల్ దొరికినా మరో కేసులో బెయిల్ దొరకకపోవటంతో చివరకు జైలులోనే ఉండిపోవాల్సొచ్చింది. ఇదే సమయంలో మాజీ సీఎం చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. లాలూ కిడ్నీల పనితీరు 25 శాతానికి పడిపోయినట్లు డాక్టర్ ప్రసాద్ వివరించారు.
దాదాపు 20 సంవత్సరాలకు పైగా షుగర్ వాధితో ఇబ్బందులు పడుతున్న లాలూ కిడ్నీల పనితీరు మెల్లిగా తగ్గిపోయిందన్నారు. కిడ్నీ పనితీరు దెబ్బతినటంతో ఎప్పుడైనా అరోగ్యం క్షీణించే ప్రమాదముందున్నారు. రెండు కిడ్నీల పనితీరు బాగా దెబ్బతిన్నాయని ఎక్కడికి తీసుకెళ్ళినా కిడ్నీల పనితీరు మెరుగుపడదని కూడా ప్రసాద్ అభిప్రాయపడ్డారు. కిడ్నీల పనితీరు ఎప్పుడైనా మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందని కూడా రిమ్స్ వైద్యులను ప్రసాద్ హెచ్చరించారు.
కిడ్నీల పనితీరుకు ప్రత్యామ్నాయంగా లాలూను ఎక్కడికి తీసుకెళ్ళినా ఉపయోగం ఉండదని డాక్టర్ ప్రసాద్ స్పష్టంగా రాతమూలకంగా రాసివ్వటంతోనే లాలూ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. రెసిడెంట్ నెఫ్రాలజిస్టును సంప్రదించి భవిష్యత్ చికిత్సపై తొందరగా ఓ నిర్ణయానికి రావాలని కూడా డాక్టర్ సూచించారు. అయితే లాలూకు బెయిల్ ఇచ్చే విషయమై విచారణను వచ్చే జనవరి 22వ తేదీకి కోర్టు వాయిదావేసింది.