ప్రముఖ దర్శకుడు, కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో ఏమాత్రం వెనకాడరు. ఎదుటివారు ఎంతటివారైనా తాను చెప్పాల్సింది నిర్మొహమాటంగా చెప్పే ఆర్జీవీ.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కే ధమ్కీ ఇచ్చి హెడ్‌లైన్స్ లో నిలిచారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. `ఆపరేషన్ సింధూర్` పేరుతో వందకు పైగా టెర్రరిస్టులను హతమార్చి భారత్ పగతీర్చుకుంది. అది జీర్ణించుకోలేకపోయిన పాక్.. ఎదురు దాడికి దిగింది.
భారత్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని యుద్ధానికి కాలు దువ్వింది. డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగ బడింది. కానీ భారత్ ముందు పాక్ పప్పులు ఏమాత్రం ఉడకలేదు. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్న సమయంలో సడెన్ గా టీవీ స్క్రీన్లపై ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రత్యక్షమైంది. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
`అమెరికా మధ్య వర్తిత్వంలో రాత్రంతా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీకరించాయి. సరైన సమయంలో ఇరు దేశాలు తెలివిగా వ్యవహరించాయి. అందుకు ధన్యవాదాలు` అంటూ ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం పాక్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. శనివారం రాత్రి బార్మర్, శ్రీగంగానగర్‌లలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు యత్నించింది.
భారత సైన్యం వాటిని కూల్చివేయడంతో ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక భారత్, పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేసిన ట్వీట్ పై డైరెక్టర్ ఆర్జీవీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రంప్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన ఆయన.. `నువ్వు వచ్చి చెప్పే వరకు మాకు కామన్ సెన్స్ కానీ, తెలివితేటలు కానీ లేవని నువ్వు అనుకుంటున్నావా?` అంటూ బదులిచ్చాడు. దీంతో ఆర్జీవీ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆర్జీవీ వ్యాఖ్యలను సమర్థిస్తుండటం విశేషం.
U mean we neither have common sense nor intelligence till u came and EDUCATED US https://t.co/FUr4D1dJOB
— Ram Gopal Varma (@RGVzoomin) May 10, 2025