ఎన్నారైలతో సత్సంబంధాలు, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRTS) కార్యచరణపై చిన్న పరిశ్రమలు మరియు ఎన్నారై సంబంధాల శాఖా మంత్రి ‘కొండపల్లి శ్రీనివాస్’ సమీక్ష నిర్వహించారు. ఏపీలోని ఏపీ ఎన్నార్టీ సొసైటీ కార్యాలయంలో వర్చువల్ రివ్యూ నిర్వహించిన ఆయన…తెలుగు ఎన్నారైల కోసం విదేశాలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ వివరాలనను మంత్రి ‘కొండపల్లి శ్రీనివాస్’ కు జీఏడీ(పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ ఎస్.సురేష్ కుమార్, APNRTS సీఈవో పీ.హేమలతా రాణి వివరించారు. ఎన్నారైల కోసం 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, ఆ హెల్ప్ లైన్ ద్వారా సేవలందిస్తున్నామని వెల్లడించారు. స్వదేశానికి తిరిగి రావడం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్నారైలకు దౌత్యపరమైన సాయం చేయడం, అంబులెన్సులు ఏర్పాటు చేయడం, అస్థికలు స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. విదేశాలలోని భారత దౌత్య కార్యాలయాలు, తెలుగు అసోసియేషన్లు, సొసైటీ కో ఆర్డినేటర్లు, ఏపీ భవన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతరుల ద్వారా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఈ సందర్భంగా ఏపీతో ఎన్నారైలు నిత్యం సంబంధాలు కలిగి ఉండేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కొన్ని అమూల్యమైన సలహాలను మంత్రి ‘శ్రీనివాస్’ సూచించారు. ఏపీఎన్నార్టీల గురించి విదేశాల్లోని ఎన్నారైలకు మరింత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని, వారు వినియోగించుకోగలిగిన సేవల గురించి వారికి తెలియపరిచేలా ప్రమోషన్లు చేపట్టాలని సూచించారు. విదేశాల నుంచి బహిష్కరించిన ఎన్నారైలలకు మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రచించాలని సూచించారు.