తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాస్తవానికి ఈ ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 10 గంటల 28 నిమిషాలకు జరగాల్సి ఉండగా దానిని మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మార్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు.
ఈ రోజు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,ఖర్గేలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని వ్యక్తిగతంగా వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభకు గెలుపొందిన 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపించారు. వారితో పాటు సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబులకు కూడా ఆహ్వానాలు అందాయి. మరోవైపు, ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార సభ కార్యక్రమం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
డీజీపీ రవి గుప్తా, జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ ల పర్యవేక్షణలో ఈ సభ ఏర్పాట్లను తెలంగాణ సీఎస్ శాంతి కుమారి పర్యవేక్షించారు. రేపు రేవంత్ రెడ్డితో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి చిదంబరం, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే వంటి నేతలు కూడా రాబోతున్నారు. ఈ క్రమంలోనే రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలంతా రావాలని రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇక, ఢిల్లీ పర్యటన ముగించుకొని ఈ రోజు మధ్యాహ్నానికి హైదరాబాద్ కు రావాల్సిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా వెనుదిరిగారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కే సమయానికి ఢిల్లీ హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో వెనక్కు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే పిలుపుతో మహారాష్ట్ర సదన్ కు రేవంత్ వెళ్లారు. క్యాబినెట్ కూర్పుపై మరోసారి రేవంత్ తో చర్చించేందుకు ఆయనను వెనక్కి పిలిచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని తాజాగా ఆ భేటీ ముగియడంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది.