కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలకే తన మద్దతు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జీవితంలో నిరాశ చెందకుండా ముందుకెళ్లాలనే కల సాకారమైందని, నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నానని చెప్పారు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..పలు కీలక అంశాలపై తన మనసులో ఉన్న అభిప్రాయాలు వెల్లడించారు. పక్షపాతం లేకుండా పాలన చేయాలనుకుంటున్నానని, తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలని అనుకుంటున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఏపీ సహా.. షర్మిల రాజకీయాలు, సీఎం జగన్‌తో ఉన్న చనువు వంటి వాటిని ఆయన వివరించారు.
“ఏపీ పరిణామాలపై నేను ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. షర్మిల మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. మా ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో ఆమెకు నా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ సీఎంగా నాపై ఉంది. షర్మిలకి నేను అండగా ఉంటా.. ఇక జగన్ పని అయిపోయింది. ఈ సారి ఏపీలో మార్పు ఖాయమని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ విస్తరణకు నేను అన్ని రకాలుగా ఉపయోగపడతా. పార్టీకి, షర్మిలకు ఉపయోగపడుతుంటే అన్ని రకాలుగా పనిచేస్తా“ అని రేవంత్ అన్నారు.
జగన్‌ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తున్నానని రేవంత్ చెప్పారు. అయితే, రెండు రాష్ట్రాల మధ్య కూర్చుని చర్చించి,
పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయన్నారు. కర్ణాటకతో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, కలిసి చర్చించుకుంటా మని చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయాం.. మనుషులుగా కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రయోజనాల కోసం జగన్‌ను కలుస్తానని రేవంత్ చెప్పారు. తెలంగాణలో అధిష్టానం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుందన్నారు. తాను టీం లీడర్‌గా అందరితో కలిసి వారితో ముందుకెళ్లాలని, అదే బాధ్యతను ప్రస్తుతం నేను నిర్వహిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆ విషయంలో మోడీని ఒప్పించా
ఢిల్లీలో ఏటా జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పెరేడ్లో కొన్నాళ్లుగా తెలంగాణ శకటానికి చోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో తెలంగాణ శకటం ఉంటుందని, ప్రధాని మోడీతో ఈ విషయం మాట్లాడి శకటం ప్రదర్శించేలా ఒప్పించినట్టు సీఎం రేవంత్ చెప్పారు. అంతేకాదు, ఇటీవల ప్రధాని మోడీని కలిశాక అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కోరానని, అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.