అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలతో అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎంతమందిని వీలైతే అంతమంది ఎంఎల్ఏలతో మాట్లాడుకుని ఒక్కసారిగా అందరినీ కాంగ్రెస్ లో చేర్పించేసుకోవాలన్నది రేవంత్ వ్యూహమని పార్టీవర్గాల సమాచారం. అసెంబ్లీలోని బీఆర్ఎస్ బలం 39 మంది ఎంఎల్ఏలు. ఇందులో ఓ 30 మందిని లాగేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పార్టీ మారిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయడం, లేదా పార్టీ మారిన ఎంఎల్ఏలు రాజీనామాలు చేసే సంప్రదాయం ఎప్పుడో పోయింది.
అధికారంలో ఎవరుంటే ప్రతిపక్ష పార్టీల్లోని ఎంఎల్ఏలను లాగేసుకోవటమే ఇప్పటి సంప్రదాయం. వివిధ కారణాలతో ఎంఎల్ఏల్లో చాలామంది అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే కేసీయార్ పదేళ్ళల్లో ప్రతిపక్షాలను చీల్చేశారు. ముందుగా టీడీపీ ఎంఎల్ఏలపై గురిపెట్టిన కీసీయార్ ఒక్కొక్కళ్ళుగా అందరినీ లాగేసుకున్నారు. చివరగా టీడీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. అయితే సీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోలేకపోయారు.
ఇపుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ విషయంలో అదే అస్త్రాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికి ఐదుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ తో భేటీ అయ్యారు. రేవంత్ తో భేటీ అయ్యారంటే రాజకీయ కారణాలు కాకుండా ఇంకేమీ ఉండవని అందరికీ తెలిసిందే. అందుకనే ఐదుగురు ఎంఎల్ఏలు రేవంత్ ను కలవగానే బీఆర్ఎస్ లో సంచలనమైంది. కాబట్టి తొందరలోనే మరికొందరు ఎంఎల్ఏలు రేవంత్ ను కలవటానికి రెడీగా ఉన్నారట.
ఎందుకంటే చాలామంది ఎంఎల్ఏలకు వ్యాపారాలున్నాయి. వ్యాపారాలు, కాంట్రాక్టులు సక్రమంగా సాగాలన్నా, అనుమతులు, బిల్లులు పెండింగులో పడకుండా క్లియర్ కావాలన్నా అధికారపార్టీలో ఉండక వేరేదారిలేదు. ఈ పాయింటును అడ్వాంటేజ్ గా తీసుకునే కేసీయార్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్నది రేవంత్ వ్యూహంగా పార్టీలో టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ లో చేరబోయే బీఆర్ఎస్ ఎంఎల్ఏల బలం 20-25కు చేరుకోగానే టోకున చేర్చేసుకుని బీఆర్ఎస్ఎల్పీ విలీనం జరిపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అది పార్లమెంటు ఎన్నికల్లోపు అయిపోతుందా ? లేకపోతే తర్వాతనా అన్నదే తేలాలి.