తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అదే పనిగా విరుచుకుపడే నేతల్లో తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రూటు కాస్త సపరేట్. గులాబీ బాస్ పై విమర్శలు చేయటానికి దడిచే రోజుల్లోనే.. తనకు తోచినట్లుగా తిట్ల దండకం వినిపించే అలవాటున్న రేవంత్.. ఇటీవల కాలంలోఏ చిన్న అవకాశం వచ్చినా చెలరేగిపోతున్నారు. మంచి వాగ్ధాటి.. లా పాయింట్ తీసినట్లుగా ప్రత్యర్థుల మీద విరుచుకుపడే రేవంత్.. తాజాగా జరుగుతున్న హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న ఆయన.. టీఆర్ఎస్ అధినేత మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే.. కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయన్న ఆయన.. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటే బాధ్యతల్ని కేటీఆర్ కు అప్పగిస్తారన్నారు. అదే సమయంలో ఓడే అవకాశం ఉన్న చోట హరీశ్ కు పగ్గాలు చేతికి ఇస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ కనిపించకుండా పోతారన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమావేశానికి కనీసం మంత్రి ఈటెల రాజేందర్ ను పిలవలేదన్నారు.
పార్టీ జెండాలో తమకూ వాటా ఉందన్న రోజునే కేసీఆర్ పీఠం కదిలిందన్నారు.సొంత పార్టీ గురించి కంటే ఎదుటి పార్టీ అంతర్గత విషయాల గురించి అదే పనిగా మాట్లాడే రేవంత్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు మంత్రి కేటీఆర్ చేతిలో ఉంచిన కేసీఆర్.. తాజాగా మూడు జిల్లాలకు సంబంధించి ముగ్గురు మంత్రుల (హరీశ్.. గంగుల.. వేముల)కు బాధ్యతలు అప్పగించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఓడే చోట దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు టికెట్టు ఇచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు.
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన గెలిస్తే తెలంగాణ ఆత్మ గౌరవం.. నిజాయితీ గెలుస్తుంది. అమరవీరులు.. ఉద్యోగులు గెలుస్తారు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పుణ్యమా అని తెలంగాణ వచ్చిందని.. ఆ కారణంతోనే కాంగ్రెస్.. బీజేపీలు తమ తెలంగాణ శాఖను ప్రారంభించాయంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పదునైన కౌంటర్ ఇచ్చారు రేవంత్. పార్టీ అధినేత్రి సోనియా తెలంగాణ ఇవ్వటం వల్లనే కేసీఆర్ ఫ్యామిలీలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి.. రేవంత్ విమర్శలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.