ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకోవటంతో.. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టటం లేదు రాజకీయ నేతలు. రైతుబంధు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన పోలింగ్ కు రెండు రోజుల ముందు రైతుల ఖాతాల్లోయాసంగి వేళ ఎకరానికి ఇచ్చే రూ.5వేలు సోమవారం ఉదయం కాఫీలు.. టీలు తాగే వేళకు టింగ్.. టింగ్ అంటూ పడుతుంటాయని మంత్రి హరీశ్ ఎన్నికల ప్రచారంలో చెప్పటం.. దీనిపై ఈసీ సీరియస్ అయి వాటి పంపిణీ వాయిదా వేయాలని ఆదేశించటం తెలిసిందే.
దీంతో.. రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడకపోవటానికి మీరు కారణమంటే.. మీరు కారణమని ఒకరిపై ఒకరు విరుచుకుపడే పరిస్థితి. రైతులు ఖాతాలో పడకుండా కాంగ్రెస్ కుట్ర పన్నినట్లుగా అధికార బీఆర్ఎస్ ఆరోపిస్తే.. టీ కాంగ్రెస్ అధినేత రేవంత్ దానికి ఘాటుకౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తున్నామని.. డిసెంబరు 6న రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పైసలు వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. రైతుబంధు అంశంపై రేవంత్ రియాక్టు అయ్యారు. తాము అధికారంలోకి వచ్చినంతనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తామని చెప్పిన ఆయన.. తాము ఎకరానికి రూ.15వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు కేసీఆర్ సర్కారు ఎకరానికి రూ.10చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. దీనికి అదనంగా రూ.5వేలు కలిపి ఇవ్వనున్నట్లుగా రేవంత్ చెబుతున్నారు.
అంటే.. ఏడాదికి రెండుసార్లు చొప్పున ఎకరానికి రూ.7500చొప్పున ఇవ్వనున్నట్లుగా రేవంత్ చెప్పారు. రైతుబంధు పైసలు తమ కారణంగా ఆగలేదన్న రేవంత్.. ‘‘అన్నీ బాగున్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టు మామ కేసీఆర్ అతి తెలివి, అల్లుడు హరీశ్‌రావు నోటి దూలతో తెలంగాణ రైతాంగానికి అందాల్సిన రూ.5 వేల కోట్ల పైచిలుకు రైతుబంధు నిధులు ఆగిపోయాయి. కేసీఆర్, హరీ్‌షరావు ఎక్కడ కనబడ్డా రైతులు వారి లాగుల్లో తొండలను వదలాలని, వంగబెట్టి దంచాలి. తెలంగాణ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాగానే, ‘రైతు భరోసా’ పథకం కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున మీ ఖాతాల్లో వేస్తాం’ అని ప్రకటించారు.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు చేద్దామన్న ఉద్దేశం సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీ్షరావులకు లేదన్నారు. ‘‘ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రైతుబంధుకు అనుమతి రద్దు విషయంలో తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. రైతుబంధుపై టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను రాసినట్లుగా ఒక ఫేక్ లేఖను సృష్టించి ప్రచారంలో పెట్టారు. ఓటమి భయంతో ఉన్న ఆ పార్టీ దిగజారి ఫేక్ ప్రచారాలు చేస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీఆర్‌ఎ్‌సపై చర్యలు తీసుకోవాలి’’ అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ను, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ను, డీజీపీనీ ‘ఎక్స్’ వేదికగా కోరారు.
డిసెంబరు మొదటి వారంలో ఏర్పాటయ్యే ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు.. కౌలు రైతులకు పంట సాయం డబ్బులు వేస్తామన్నారు రేవంత్. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున.. రైతు కూలీలకు ఎకరానికి రూ.10వేలు చొప్పున అకౌంట్లో వేస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు ఉండదని చెప్పే దద్దమ్మలకు తాను సవాల్ విసురుతున్నాన్నరేవంత్.. ‘‘ఉచిత విద్యుత్ అనేదే తమ కాంగ్రెస్ హయాంలో, వైఎస్ పాలనలో మొదలైంది. ఈసారి మళ్లీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు పేదల ఇండ్లకు 200 యూనిట్ల వరకూ కరెంట్‌ను ఉచితంగా ఇస్తాం.
మహాలక్ష్మి పథకం కింద ప్రతీ నెల 1న ఆడబిడ్డలకు రూ.2500 నగదు అందజేస్తాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను బొందపెడితే కాంగ్రెస్ రూ.4వేల పింఛన్ ఇస్తుందని, వృద్ధులు ఎవరూ భయపడవద్దు. కేసీఆర్ పెద్దకొడుకు కాదు. దొంగ కొడుకు. తెలంగాణలోని 2కోట్ల మంది ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం’’ అంటూ ఎన్నికల వరాల గురించి చెబుతూ ఓటర్లను ఊరిస్తున్నారు రేవంత్ రెడ్డి.