సంధ్య థియేటర్ ఇష్యూను రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఇకపై టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం నిమిత్తం సినీ పెద్దలు గురువారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దిల్ రాజు నేతృత్వంలో మొత్తం 36 మంది.. అందులో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు సీఎంతో జరిగే సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా టాలీవుడ్ ఎదుట ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను ఉంచింది. అనంతరం సినీ పెద్దల ప్రతిపాదనలు, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు.
టాలీవుడ్ ఎదుట రేవంత్ సర్కార్ పెట్టిన ప్రతిపాదనలివే..
– యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌కు టాలీవుడ్ సహకరించాలి.
– డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలు, హీరోయిన్లు కచ్చితంగా పాల్గొనాలి.
– టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు, స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.
– సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు వినియోగించాలి.
– ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకరించాలి. కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి సినీ తారలు హాజరు కావాలి.
– ఇక నుంచి ర్యాలీలు నిషేధించాలి. బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే సమస్యే ఉండదు.
– డ్రగ్స్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చురుగ్గా ఉండాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి.
– ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ప్రభుత్వానికి ఇండస్ట్రీ సహకరించాలి.
– అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యతను సెలబ్రిటీలే తీసుకోవాలి.
– ఇకపై బెనిఫిట్ షోలకు నో అంటే నో.. అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబడి ఉంటామని సీఎం అన్నారు.
ఆపై సినీ ఇండస్ట్రీ తరఫున కింగ్ నాగార్జున, దగ్గుబాటి సురేష్‌బాబు, త్రివిక్రమ్, మురళీ మోహన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, ప్రశాంత్ వర్మ వంటి వారు మాట్లాడారు. సీఎం ఎదుట కొన్ని ప్రతిపాదనలను ఉంచారు.