ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. కూటమి ఏర్పాటుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమించాడు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ వస్తున్నాడు. సీట్ల కేటాయింపులో జనసేన తక్కువ స్థానాలకే పోటీ చేసినా పట్టించుకోకుండా గెలుపు మీద ధ్యాసపెట్టి ప్రచారానికి పదును పెట్టాడు.
ప్రస్తుతం జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలవడంతో పాటు అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. ఏపీలో కూటమి గెలుపుతో నిన్న మెగా కుటుంబంలో పెద్దఎత్తున వేడుకలు చేసుకున్నారు. పవన్ సతీమణి లెజినోవాతో పాటు పవన్ మాజీ సతీమణి రేణుదేశాయ్ కుమారుడు అకీరాలు ఇంటి వద్ద బయటకు వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ పరిస్థితులలో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ స్పందన అందరినీ ఆకర్షిస్తున్నది. “ఆద్య, అకీరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పోస్టుపై జన సైనికులు కామెంట్లు చేస్తూ సంతోషం పంచుకుంటున్నారు.