తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐ అధికారులను ఆదేశించాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు పూర్తి వివరాలు సోమవారం నాడు సమర్పించాలని సిబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
ఇక, అవినాష్ రెడ్డి విచారణ వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ తరఫు లాయర్ వెల్లడించారు. వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సిబిఐ ని కోర్టు ఆదేశించింది. ఇక, మూడోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ఈరోజు కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ఉదయం పదిన్నర గంటలకు విచారణ కోసం సిబిఐ ఆఫీస్ కి వచ్చానని, 11 గంటల నుంచి ఒంటిగంట వరకు విచారణ జరిపారని వెల్లడించారు. ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని చెప్పి సిబీఐ విచారణ అధికారి కోర్టుకు వెళ్లారని వెల్లడించారు. తనను కార్యాలయంలోనే ఉండాలని చెప్పి ఆయన వెళ్లిపోయారని అన్నారు. ఆ తర్వాత కాసేపటికి కోర్టు నుంచి ఆ అధికారి వచ్చి ఈ రోజుకు విచారణ ముగిసిందని, పిలిచినప్పుడు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినట్లు వెల్లడించారు.
తన విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదని, అందుకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. ఏది ఏమైనా సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది.