టాలీవుడ్ బాహుబలి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం నిర్మాతలకు ఊరటనిస్తున్నాయి. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, అందుకే ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తొలగించాలని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టు ధర్మసనాన్ని విష్ణు అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఆ చిత్ర ప్రదర్శనలను అత్యవసరంగా నిలిపివేయలేమని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. జూన్ 16న సినిమా విడుదల అయిందని, విడుదల తేదీ కూడా ముందుగానే తెలిసిపోయిందని ధర్మాసనం చెప్పింది. అందుకే ఈ పిటిషన్ పై జూన్ 30న విచారణ జరుపుతామని, హడావిడిగా విచారణ జరపడం కుదరదని తేల్చి చెప్పింది.
అయితే, ఆలస్యం చేస్తే పిటిషన్ యొక్క ఉద్దేశం నీరుగారిపోతుందని పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఇందులో అనేక వివాదాస్పద అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. నేపాల్ కూడా ఈ చిత్రంపై నిషేధం విధించిందని ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు డైలాగులు తొలగిస్తామని దర్శకుడు ఓం గతంలో హామీ ఇచ్చారని కూడా న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ, అవి తొలగించకుండా విడుదల చేశారని అన్నారు. వాల్మీకి, తులసీదాస్ రచించిన రామాయణంలోని వర్ణనలకు విరుద్ధంగా ఆది పురుష్ ఉందని, అందుకే ఈ సినిమాను నిషేధించాలని వాదించారు.
మరోవైపు, ఈ చిత్రం మాటల రచయిత మనోజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసలు హనుమంతుడు దేవుడే కాదని, ఆయన శ్రీరాముడికి వీరభక్తుడని చెప్పారు. ఆ భక్తి వల్లే హనుమంతుడిని కూడా భారతీయులు పూజిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, మనోజ్ పై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది.