క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, డూప్లెసిస్… ఇలా ప్రపంచ స్థాయి బ్యాట్స్ మన్ లు ఆడిన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న రీతిలో ఇంత మంది స్టార్ ప్లేయర్లు ఈ జట్టు తరఫున ఆడినప్పటికీ ఆర్సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయితే, 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ లో 6 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. పంజాబ్ బ్యాట్స్ మన్ శశాంక్ చివరి బంతి వరకు ఒంటరి పోరాటం చేసినా అతడికి సహకారం అందించేవారు లేకపోవడంతో పంజాబ్ పోరాడి ఓడింది. ముఖ్యంగా కీలక సమయంలో పంజాబ్ బ్యాటర్ వధేరా చాలా నెమ్మదిగా ఆడడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ క్రమంలో పంజాబ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.
చివరి ఓవర్లో 29 పరుగులు కావలసి ఉండగా శశాంక్ వీరోచిత పోరాట పటిమ చూపి 23 పరుగులు చేయగలిగాడు. దీంతో, తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ ను బెంగళూరు ముద్దాడింది. ఈ విజయంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణ పూర్తయ్యింది. ఆర్సీబీ గెలుపు తర్వాత కోహ్లీ కంటతడి పెడుతూ ఎమోషనల్ అయ్యాడు. కీలకమైన ఫైనల్ పోరులో నిర్ణీత 20 ఓవర్ లలో బెంగళూరు జట్టు 190 పరుగులు చేసింది. లక్ష ఛేదనలో పోరాడిన పంజాబ్ 184 పరుగులు చేసింది.