రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ సాలా కప్ నమ్దే అంటూ ఏళ్లకు ఏళ్లు ఊరిస్తూ వచ్చిన ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన తుదిపోరులో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్) ను 6 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని ఇంటికి పట్టికెళ్ళింది.
గతంలో మూడు సార్లు ఫైనల్స్ వరకు వెళ్లి నిరాశ చెందిన ఆర్సీబీ.. ఈసారి పట్టుదలతో ఆడి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ మరియు విరాట్ కోహ్లీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా యువత రోడ్లపైకి వచ్చి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగి పోయారు. సెలబ్రిటీలు కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆర్సీబీ కప్పు కొట్టడంతో ఆనందాన్ని పట్టలేక ఎగిరి గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సతీమణి ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ.. `ఈ సాలా కప్ నమ్‌దు. 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్‌కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్` అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో `డ్రాగన్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఐపీఎల్ ఫినాలే కావడంతో అక్కడే ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి మరీ టీమ్‌తో కలిసి మ్యాచ్ చూశాడు ప్రశాంత్.
ఇక మరోవైపు విరాట్ కోహ్లీకి డైహార్డ్ ఫ్యాన్ అయిన అల్లు అయాన్ ఆర్సీబీ విజయంతో ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. సంతోషాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.