ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం రాజకీయాలు మరింత సెగ పుట్టిస్తున్నాయి. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ఇటీవల చేసిన వ్యాఖ్యల దరిమిలా.. ఇక్కడ ఏం జరుగుతుంది? అనే చర్చ తీవ్రస్థాయిలో ఊపందుకుంది. వైసీపీ తరపున 2019లో విజయం దక్కించుకున్న కాపు.. గతంలో కాంగ్రెస్ తరఫున కూడా ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయనపై సర్వేలో వ్యతిరేకత వచ్చిందని చెబుతూ.. వైసీపీ ఆయనను పక్కన పెట్టింది.
ఇదే కాపులో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో తాను జగన్‌ను నమ్మానని, ఆయన తమ గొంతు కోశారని తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమని చెప్పారు. అయితే.. అది ఇండిపెండెంట్‌గానా.. లేక.. వేరే పార్టీలోనా? అనేది మాత్రం కాపు చెప్పలేదు. అంతేకాదు..ఏకంగా రెండు నియోజకవర్గాలపై ఆయన కర్చీఫ్ వేసేశారు. రాయదుర్గంతోపాటు కళ్యాణదుర్గంలోనూ తాము పోటీ చేయనున్నట్టు చెప్పారు. ఈ దఫా తన భార్య పద్మావతి, లేదా తన కుమారుడు రంగంలోకి దిగుతారని కాపు చెప్పుకొచ్చారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ, వైసీపీ కాదన్నాక.. కాపుకు కనిపిస్తున్న మార్గాలు.. ఒకటి కాంగ్రెస్‌లో తిరిగి చేరడం, రెండు.. ఇండిపెండెంట్‌గానే బరిలో నిలవడం. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల తీసుకుంటే.. ఆ పార్టీలో చేరేందుకు కాపు సిద్ధంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి పెద్దగా ప్రయత్నం కూడా అవసరం లేదు. వెంటనే టికెట్ వస్తుంది. అయితే.. ఏపీకి అన్యాయం చేసిందని గతంలో ఉద్యమాలు చేసిన కాపు.. ఇప్పుడు అదే పార్టీ తరఫున పోటీ చేసినా.. ప్రయోజనం ఉండదనేది విశ్లేషకుల మాట.
ఇక, ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. మంచి పేరు, పలుకుబడి, ఆర్థికంగా దన్ను ఉన్న కాపుకు.. టీడీపీ బలమైన ప్రత్యర్థి కానుంది. గత ఎన్నికల్లో త్రికోణ పోటీ నెలకొంది. అయితే.. ఈ దఫా జనసేన-టీడీపీ కలిసి బరిలో నిలుస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు విజయం ఖాయమని అంటున్నారు. పైగా ఆయన ప్రజల్లోనే ఉంటున్నారు. వివాద రహితుడు, కలుపుగోలు తత్వం ఉన్న నేత. దీంతో కాపు పై కాలవ విజయం ఖాయమని.. కాపు ప్రయత్నాలు కేవలం టీ కప్పులో తుఫానేనని అంటున్నారు. ఇక, వైసీపీ ఎలాంటి అభ్యర్థిని నిలబెడుతుందనేది చూడాల్సి ఉంది.