ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని రీతిలో..ప్రమోషన్ మీద వెళుతున్న ఒక పోలీసు అధికారికి.. ఆయన సిబ్బంది సాగనంపిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కవర్ల కొద్దీ పూలను జల్లుతూ.. ఆయన ఛాంబర్ నుంచి కారు వరకు వెళ్లి సాగనంపిన వైనం ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకూ ఈ అనూహ్య ఘటన ఎక్కడ చోటు చేసుకున్నది చూస్తే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అధికారులు రావటం.. బదిలీ మీదనో.. ప్రమోషన్ మీదనో తిరిగి వెళ్లటం మామూలే.
కానీ.. అలా వెళుతున్న అధికారి విషయంలో అనుసరించిన తీరు.. వీడ్కోలు పలికిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ డీజీ మహేందర్ రెడ్డితో శభాష్ అనిపించుకున్న రాయదుర్గం సీఐ రవీందర్ కు ఇటీవల ఏసీపీగా పదోన్నతి లభించింది. దీంతో.. ఆయన రిలీవ్ అయ్యారు. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆయన.. ఎక్కడ ఉంటే అక్కడ స్టేషన్ డెవలప్ మెంట్ కోసం.. సిబ్బంది మంచి చెడుల గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారన్న పేరుంది.
శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో తన చాంబర్ నుంచి బయటకు వచ్చిన ఆయనకు స్టేషన్ సిబ్బంది సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన వీడ్కోలు కార్యక్రమాన్ని రోటీన్ కు భిన్నంగా నిర్వహించారు. దారి పొడుగునా మెడలో పూలదండలు వేయటం.. పూలను విపరీతంగా జల్లి తమ అభిమానాన్ని ప్రదర్శించారు. తాను తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చే వరకు.. సిబ్బంది ఇలా ప్లాన్ చేస్తారని తెలీదని పేర్కొన్నారు. తమ అభిమానాన్ని పూలవర్షంతో కురిపించి ప్రదర్శించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఉదంతం పోలీసు శాఖలో ఇప్పుడు అంతా ఆసక్తికర చర్చగా మారింది.