రాజకీయాల్లోకి ప్రవేశించిన అతి కొద్దికాలంలోనే మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పార్టీలు మారి చరిత్రను సృష్టించినట్లే ఉన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం రావెల తన కుటుంబసభ్యులతో కలిసి వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి చేతులమీదగా రావెల వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీలో రావెల చేరటం ఇది రెండోసారి. కేంద్రప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన రావెల 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పట్లో ఉద్యోగానికి రాజీనామా చేసిన రావెల నేరుగా టీడీపీలో చేరారు.
గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు. వెంటనే మంత్రి కూడా అయిపోయారు. కొంతకాలం తర్వాత క్యాబినెట్లో నుండి చంద్రబాబునాయుడు తప్పించారు. అప్పటినుండి అసంతృప్తితో రగిలిపోయారు. 2019లో అధికారంలోకి రాగానే రావెల వైసీపీలో చేరారు. కొంతకాలం ఉన్న తర్వాత పత్తిపాడు ఎంఎల్ఏగా గెలిచి మంత్రయిన మేకతోటి సుచరిత వర్గానికి రావెల వర్గానికి పడలేదు. రెగ్యులర్ గా ఏదో గొడవలు అవుతునే ఉండేవి. అందుకనే వైసీపీలో ఇమడలేక రాజీనామా చేసేశారు. కొంతకాలం ప్రశాంతంగా ఉది తర్వాత జనసేనలో చేరారు.
అక్కడ ఎక్కువరోజులు ఉండలేక బీజేపీలో చేరారు. అక్కడ ఏమైందో ఏమో కుదురుకోలేక రాజీనామా చేశారు. కొంతకాలం తర్వాత ఏపీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కదా అందుకనే ఆ పార్టీలో లాభంలేదని అనుకునుంటారు. అందుకనే ఆలోచించి మళ్ళీ ఇపుడు వైసీపీలో చేరారు. అంటే రాజకీయాల్లోకి ప్రవేశించిన పదేళ్ళల్లోనే రావెల ఇన్నిపార్టీలను మార్చేశారు. రావెల చేరాల్సిన పార్టీలు వామపక్షాలు మాత్రమే మిగిలున్నాయనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
పదేళ్ళల్లో ఇన్నిపార్టీలు మారిన నేతలు రావెల తప్ప మరొకరు లేరేమో అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. ఒక్కనేత ఇన్ని పార్టీలు మారారంటేనే లోపం ఎక్కడుందో అందరికీ అర్ధమైపోతోంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రావెల ఏ పార్టీలోను ఇమడలేక, లోకల్ నేతలలో సర్దుబాటు చేసుకోలేక పార్టీలు మారుతున్నట్లు అర్ధమవుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రావెల ఎన్నికల తర్వాత వైసీపీలో ఎంతకాలం ఉంటారో చూడాలి. ఎందుకంటే నాలుగురోజులవ్వగానే పార్టీలో సమస్యలు మొదలవుతున్నాయి కాబట్టే.