తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ మరో చిక్కులో పడింది. ఇప్పటికే పలు రూపాల్లో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నాయకుల జంపింగులు.. అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లు వంటి పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఇలాంటి సమయంలో బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ బంధువుకు చెందిన ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.
శనివారం రాత్రి బాగా పొద్దు పోయాక.. జున్వాడ ఫామ్ హౌస్‌పై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీ సులు దాడులు చేశారు. ఇక్కడికి సమీపంలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందని కొందరు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దాడులు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా భారీ సౌండ్‌లో డీజే వంటివి నిర్వహిస్తూ.. 21 మంది మెన్, 14 మంది ఉమెన్ డ్యాన్స్ చేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.
అదేసమయంలో ఫారిన్ లిక్కర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరి నుంచి శాంపిళ్లు సేకరించి.. పరీక్షలు జరపగా.. ఈ పార్టీలో పాల్గొన్న ఒకరిద్దరు.. నిషేధిత కొకైన్‌ను వినియోగించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ పీల్చినట్టు నిర్ధరించా రు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఈ వ్యవహారం.. రాజకీయంగా బీఆర్ ఎస్ మెడకు చుట్టుకుంది.
ఇప్పుడేమంటావ్: మంత్రి బండి
తాజా ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ షార్ప్‌గా స్పందించారు. రేవ్ పార్టీ జరిగింది కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే అని ఆయన ఆరోపించారు. “కేటీఆర్ ఇప్పుడేమంటాడో.. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో?“ అని బండి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అధికార పార్టీ దీనిపై సమగ్ర విచారణ జరపాలని, రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.