తెగింపుతో ఓకే. బరితెగింపుతోనే ఇబ్బంది అంతా. అవసరం కోసం.. న్యాయం, ధర్మం కోసం తెగింపుతో పోరాడితే పోయేదేమీ ఉండదు. అందుకు భిన్నంగా స్వార్థం కోసం..చేసే ప్రతి పనితోనూ తిప్పలే. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగర శివారులో అదే పనిగా రేవ్ పార్టీ లు సాగుతున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా నగర శివారులోని మారుమూల ప్రాంతాల్లో రేవ్ పార్టీలను నిర్వహించటం.. మోతాదు మించిన విచ్చలవిడితనంతో వ్యవహరించే వేళలో పోలీసుటు ఎంట్రీ ఇవ్వటం.. అదుపులోకి తీసుకొని.. కటకటాల వెనక్కి పంపటం తెలిసిందే. అందుకే.. ఇలాంటి పంచాయితీలకు దూరంగా ఉండేవారు కొందరైతే.. పూర్తిస్థాయి బరితెగింపుతో ఏం జరిగినా చూసుకుందామన్న తెగింపుతో రేవ్ పార్టీలకు అటెండ్ అయ్యే వారు మరికొందరు.
మొన్నటివరకు నగర శివారులోని తోటల్లో సాగే రేవ్ పార్టీలు ఇప్పుడు హైదరాబాద్ మహానగర ప్రధాన వీధుల్లోకి ఈ దరిద్రపు కల్చర్ షురూ అయ్యింది. దీనికోసం శివారు వరకు ఎందుకు? పోలీసుల్ని మేనేజ్ చేసేస్తే సరిపోలా? అనుకొని నగరం నడిబొడ్డున నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అధికారులు తాజాగా ఎంట్రీ ఇచ్చారు. ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే మాదాపూర్ లోని ఒక అపార్టుమెంట్ పరిధిలో నిర్వహించిన రేవ్ పార్టీని భగ్నం చేశారు అధికారులు.
ఈ సందర్భంగా పద్నాలుగు మంది యువకులు.. ఆరుగురు మహిళల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీని నిర్వహించిన నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిలో పలువురు డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్న విషయాన్ని గుర్తించారు. అనుమానం ఉన్న వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. ఈ పార్టీలో కొకైన్ ఒక గ్రాము.. ఎండీఎంఏలు రెండు గ్రాములు.. మత్తు పదార్థాలను టాస్కుఫోర్సు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
అంతేకాదు.. విదేశీ లిక్కర్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు. పాతికేళ్ల కుర్రాడు తన పుట్టిన రోజున రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన బాధ్యతను ఒక ఈవెంట్ మేనేజర్ కు ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న పార్టీల్లో డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు ఈవెంట్ సంస్థలు. అందుకే.. ఊరించే పార్టీల గురించి సమాచారం అందినంతనే.. క్రాస్ చెక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. పబ్ లలో జరిగే పార్టీలకు వీలైనంత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాదనుకుంటే మాత్రం సమస్యల ఛట్రంలో చిక్కుకుపోవటం ఖాయంగా చెప్పాలి.