హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. మాదాపూర్ లో జరిగిన ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీపై పక్కాగా ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. టాలీవుడ్ నిర్మాత, ఫైనాన్షియర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. ఆ పార్టీలో పాల్గొన్న పలువురు యువతులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు పట్టబడ్డట్లు తెలుస్తోంది. ఈ కేసులో నార్కోటిక్ అధికారులు విచారణ వేగవంతం చేసి సినీ నిర్మాత వెంకట్ తో పాటు మరో ఐదుగురు ని అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఐదుగురిలో ఒకరైన బాలాజీ అనే వ్యక్తిపై గతంలో కూడా పలు కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు. టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు ఫైనాన్షియల్ గా వెంకట్ వ్యవహరించారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి వెంకట్ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. గత మూడు నెలలుగా వెంకట్ కదలికలపై నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే తాజా రేవ్ పార్టీని భగ్నం చేసింది. అయితే, డ్రగ్స్ మాఫియాతో వెంకట్ కు ఎటువంటి సంబంధాలున్నాయి, ఎవరెవరితో పరిచయాలున్నాయి అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
టాలీవుడ్ లో ఎవరికైనా వెంకట్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీ గురించి చాట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే, వెంకట్ ఫోన్ కనిపించడం లేదని వారు వెల్లడించారు. వెంకట్ ఫోన్ లో బిగ్ షాట్ ల ఫోన్ నెంబర్లు, వాట్సాప్ చాట్ ఉన్నాయని తెలుస్తోంది. ఇదే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలను నార్కోటిక్ అధికారులు సేకరిస్తున్నారు. అరెస్టయిన నిందితులను మాదాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పగించారు.