దేశ న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగం పరంగా.. ప్రజలకు న్యాయం అందించ డంలో కోర్టుల పాత్రను ఎవరూ కొట్టిపారేసే పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికీ.. నిత్యం ప్రజలు.. కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే.. కోర్టులు వేస్ట్ అని కోర్టుల్లో కేసులు వేయడం సమయం బొక్క తప్ప మరేమీ లేదని.. తానైతే.. తనకు ఏదైనా సమస్య వస్తే.. కోర్టుకు వెళ్లే ప్రయత్నం కూడా చేయనని.. సాక్షాత్తూ.. దేశ అత్యున్నత సుప్రీం కోర్టుకు ఏడాదిన్నర కిందటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
న్యాయవ్యవస్థ ప్రస్తుతం శిధిలావస్థకు చేరిన దుస్థితిలో ఉందని జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ‘‘ఎవరు ఈ రోజుల్లో కోర్టుకెళతారు? ప్రజలు ఎందుకు కోర్టు కెళ్లామా అని చింతిస్తున్నారు. ఎవరి మాటో ఎందుకు..? నేనే కోర్టుకు వెళ్లను. కోర్టుకు వెళ్లడం వల్ల.. డబ్బులు దండగ.. టైం వేస్ట్. కోర్టుకెళ్లి చూద్దాం అని ఎవరో కొద్దిమంది… అంటే కార్పొరేట్లు ప్రయత్నం చేస్తున్నారు. కేసు గెలిస్తే వందల కోట్లలో లాభం ఉంటుంది గనక.. వారు వెళ్లున్నారు“ అని జస్టిస్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అక్కడితో కూడా ఆగని గొగోయ్.. కోర్టుకెళితే వ్యక్తిగత విషయాలు బహిరంగమై మరింత కలవరం ఏర్పడుతుందని, ఇబ్బంది పడడం తప్ప మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. కోర్టుకెళ్లినా మీకు తీర్పు వెంటనే రాదు. సత్వర న్యాయం జరగదు. ఈ మాటలనడానికి నేను సంకోచించడం లేదు అని ఆయన కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యే పదవీ విరమణ చేసి, ఆ వెంటనే రాజ్యసభకు నామినేట్ అయిన జస్టిస్ గొగోయ్ న్యాయవ్యవస్థ తీరుపై ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ సంచలన చర్చకు దారితీసింది.
‘‘ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరాలని మనం లక్షిస్తున్నాం. కానీ ఇటు చూస్తే మన న్యాయవ్యవస్థ దుస్థితిలో ఉంది. పెట్టుబడులు రావాలంటే బలమైన న్యాయవ్యవస్థ అవసరం. నిర్దిష్ట కాలావధిలో వాణిజ్య వివాదాలు పరిష్కారం కావాలి“ అని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. ఏదేమైనా.. నిన్న మొన్నటి వరకు న్యాయపాలికగా ఉన్న సుప్రీం మాజీ సీజే.. వ్యాఖ్యల వెనుక అసహనం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.
దీనికి యంత్రాంగమేదీ? వ్యవస్థ పనిచేయడం లేదు.. వాణిజ్య కోర్టుల పరిధిలోకి ప్రతీ కేసునూ తెస్తున్నారు. మామూలు కేసులు చూసే జడ్జే ఆ కేసులనూ చూస్తున్నారు. ఇది మారాలి’’ అని విమర్శలు గుప్పించారు. ‘‘2020లో దాదాపు ప్రతీ వ్యవస్థ పనితీరూ అధ్వాన్నంగా సాగింది. అందులో న్యాయవ్యవస్థ కూడా ఉంది. ఆ సమయంలో సబార్డినేట్ కోర్టుల్లో దాదాపు 60 లక్షల కేసులు అదనం గా వచ్చి చేరాయి. హైకోర్టులో మూడు లక్షల కేసులు, సుప్రీంకోర్టులో ఏడువేల కేసులు దాఖలయ్యాయి. జడ్జీల సంఖ్య మాత్రం పెరగలేదు.