తెలుగు నుంచి విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి స్థాయి పెద్ద తారలు ఓటీటీ ఎరేనాలోకి ఎంట్రీ ఇచ్చిన సిరీస్.. రానా నాయుడు. మన దగ్గర మిడ్ రేంజ్ హీరోలు సైతం వెబ్ సిరీస్‌ల పట్ల ఆసక్తి ప్రదర్శించని టైంలో వెంకీ, రానా ధైర్యం చేసి డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఐతే వెంకీ నటించిన సిరీస్ అంటే ఏదో ఊహించుకుని ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోయింది.
వెంకీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటి వాళ్లందరూ ఇందులో వెంకీ పాత్రను తీర్చిదిద్దిన తీరు.. ఆయన నోటి నుంచి వచ్చిన బూతు డైలాగులు.. సిరీస్‌లోని అడల్ట్ కంటెంట్ చూసి తట్టుకోలేకపోయారు. ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్‌కు కొంచెం అలవాటు పడ్డ వాళ్లు కూడా.. వెంకీని ఇలాంటి పాత్ర, సిరీస్‌లో చూడలేకపోయారు. ఈ సిరీస్‌కు వ్యూయర్‌షిప్ ఓకే అనిపించినా.. నెగెటివిటీ మాత్రం బాగానే వచ్చింది. దీంతో రెండో సీజన్ విషయంలో టీం జాగ్రత్త పడ్డట్లే కనిపిస్తోంది.
రానా నాయుడు సీజన్-2 జూన్ 13 నుంచే స్ట్రీమ్ కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేశారు. ఇంకా తెలుగు ట్రైలర్ రాలేదు కానీ.. హిందీ వెర్షన్లోనే టీం జాగ్రత్త స్పష్టంగా కనిపించింది. ఎక్కడా అడల్ట్ కంటెంట్ కనిపించలేదు. చిన్న లిప్ లాక్ సీన్ కూడా పెట్టలేదు. కస్ వర్డ్స్ లేవు. వల్గారిటీని పూర్తిగా పరిహరించారు. సిరీస్‌లో మొత్తంగా ఏముందో ఏమో కానీ.. ట్రైలర్లో మాత్రం అడల్ట్ కంటెంట్ ఛాయలే కనిపించలేదు.
ఒక్క బూతు మాట లేదు. యాక్షన్ ప్రధానంగా ట్రైలర్ సాగింది. తొలి సీజన్‌తో పోలిస్తే యాక్షన్ డోస్ గట్టిగానే ఉండబోతోందని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. ఇకపై గొడవలు ఆపేయాలని నిర్ణయించుకున్న రానా నాయుడు.. చివరి మిషన్ పూర్తి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీతో అసోసియేట్ అవుతాడు. కానీ ఈ క్రమంలో ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. తన శత్రువులు అతణ్ని ఆపడానికే తండ్రినే ఆయుధంగా ఉపయోగిస్తారు. మరి తండ్రితో, విలన్లతో పోరాడి రానా ఎలా గెలిచాడు అన్నది కథ. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ పాత్ర చేశాడు. రానా, వెంకీ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లే ఉన్నారు.