సీఎం జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మసకబారుతుందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. తిరుమలలో క్రిస్టియానిటీ పెరుగుతోందని, జగన్ క్రిస్టియన్ కావడంతోనే ఆలయంలో కూడా ఆ మతం వ్యాప్తి చెందుతుందని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఈవో ధర్మారెడ్డి తో పాటు ఆలయ సిబ్బందిలో చాలామంది క్రిస్టియన్లున్నారంటూ ఆయన సంచలన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తిరుమల పోలీస్ స్టేషన్లో రమణ దీక్షితులుపై కేసు కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రమణ దీక్షితులుపై టీటీడీ పాలకమండలి వేటు వేసింది. టీటీడీ ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయర్లపై రమణ దీక్షలు సంచలన వ్యాఖ్యలు చేశారని, అందుకే ఆయనపై వేటు వేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
ఈ క్రమంలోనే రమణ దీక్షితులు తొలగింపుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా వైసీపీ నేతల అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని బయటపెట్టిన రమణ దీక్షితులపై వేటు వేయడం బాధాకరమన్నారు. టీటీడీలో, తిరుమల కొండపై జరుగుతున్న దారుణాలను భక్తులకు రమణ దీక్షితులు తెలియజేశారని, అందుకే ఆయనపై వేటు వేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.