టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారిపై తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశపారంపర్య అర్చకులను టీటీడీలోని ఓ ఉన్నతాధికారి బలవంతంగా టీటీడీ ఉద్యోగులుగా మార్చారని షాకింగ్ ఆరోపణలు చేశారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థను పరిరక్షించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, వాటిని సైతం ఆ అధికారి బేఖాతరు చేశారని ఆరోపించారు.
అర్చక వ్యవస్థకు ఆ అధికారి విఘాతం కలిగించారని, ఇక కోర్టును ఆశ్రయించడమేనా? అని ప్రశ్నించారు. ఇక, ఈ వ్యవహారంపై సలహా ఇవ్వాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామిని ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్ చేయడం షాకింగ్ గా మారింది. 2018లో నాటి పాలకమండలి 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమలు చేసింది.
దీంతో, రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస మూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులుతో పాటూ మరో ఐదుగురు రిటైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై తిరుచనూరు ఆలయం ప్రధాన అర్చకుడితోపాటు మరో అర్చకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, 2018 డిసెంబర్లో రిటైర్డ్ నిబంధనను వర్తింపచేయకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఆ ఆదేశాలను తమకూ అమలు చేయాలని అర్చకులంతా టీటీడీ అధికారులను కోరారు. ఈ విషయంపై జగన్ తో రమణ దీక్షితులు కూడా భేటీ అయ్యారు. జగన్ అధికారం చేపట్టగానే రమణ దీక్షితులును తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారు. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నతాధికారిపై రమణ దీక్షితులి ట్వీట్, స్వామిని ట్యాగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.