రామ్ గోపాల్ వర్మ..అలియాస్ ఆర్జీవీ…వివాదాలకు కేంద్ర బిందుకుగా మారే ఈ జీవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. సినిమాలు మొదలు రాజకీయాల వరకు వర్మ వేలు పెట్టని రంగం…చేయని రచ్చ లేదంటే అతిశయోక్తి కాదు. మొన్నటికి మొన్న ట్రంప్ కే కౌంటర్ ఇచ్చాడు వర్మ. ట్రంపు చెప్పే వరకు భారతీయులకు ఇంగిత జ్ఞానం లేదా అంటూ కంపు కంపు చేశాడు వర్మ. ఇపుడు ఏకంగా సెన్సార్ బోర్డునే టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
సెన్సార్ బోర్డుకు ఎక్స్ పైరీ డేట్ వచ్చేసిందని వర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సినిమాల్లో బూతులుండకూడదని సెన్సార్ బోర్డు ఎన్నో నిబంధనలు విధిస్తోందని, సినిమాల్లోనే ఇదంతా ఉన్నట్లు బయట కూడా చాలామంది మాట్లాడుతున్నారని ఆర్జీవీ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. ఈ స్మార్ట్ ఫోన్ జమానాలో పోర్న్ వీడియోలు, హింసాత్మక దృశ్యాలు చాలామంది సులభంగా చూసే అవకాశముందని గుర్తు చేశారు.
మరి, వినోదం కోసం తీసే సినిమాల్లో అవి ఉండకూడని, అటువంటి సన్నివేశాలు చూపించొద్దని అనడం ఎంతవరకు సమంజసం అని వర్మ ప్రశ్నించాడు. ఫోన్లో చూస్తే తప్పు లేనప్పుడు, పెద్ద తెరపై బూతులు చూస్తే తప్పేంటని తన మార్క్ లాజిక్ తో వర్మ క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ తరహా ఆంక్షలు నిజంగా అర్థం లేనివని వర్మ అన్నాడు.
“సెన్సార్ బోర్డ్ అనేది ఎప్పుడో కాలం చెల్లిపోయింది (ఎక్స్‌పైర్ అయిపోయింది). అదొక స్టుపిడ్ థింగ్” అంటూ వర్మ చేసిన కామెంట్లపై సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వర్మ బూతు లాజిక్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మొబైల్ ఫోన్లో ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చూసే విషయాన్ని, పబ్లిక్ గా థియేటర్లో లక్షలాది మంది చూసే విషయాన్ని పోల్చిన వర్మకు మైండ్ లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.