టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాద్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఆర్జీవీ కి మూడు నెలలు జైలు శిక్ష విధించింది. 2018లో ఆర్జీవీ పై ఒక చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశాడు. ఏడేళ్ల నుంచి ఈ కేసులో విచారణ జరుగుతూనే ఉంది.
విచారణ నిమిత్తం పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు కోర్టు నోటీసులు పంపింది. కానీ వర్మ కనీసం ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. కోర్టు నోటీసులకు రెస్పాండ్ కాలేదు. ఆర్జీవీ తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహించిన ముంబై కోర్టు.. తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో వర్మని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
అలా చేయని పక్షంలో ఆర్జీవీ మూడు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా జారీ చేసింది. అయితే ఇంత వరకు ఈ విషయంపై వర్మ స్పందించలేదు. కాగా, `సిండికేట్` పేరుతో తాజాగా వర్మ ఓ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. సత్య సినిమా స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిండికేట్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.