ప్రస్తుతం టాలీవుడ్లో సెట్స్ మీద ఉన్న క్రేజీ చిత్రాల్లో రామ్-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి.. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరోతో సినిమా చేస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే టైటిల్ ప్రకటించకుండా సినిమాను మొదలుపెట్టి.. షూట్ మధ్యలో ఉండగా టైటిల్ ప్రకటించడం బోయపాటికి అలవాటు. దీన్ని ఆయన ఒక సెంటిమెంటులా భావిస్తాడు.
రామ్ సినిమాకు కూడా ఆయన అదే ఒరవడి కొనసాగించాడు. కాకపోతే ఈసారి రిలీజ్ డేట్ ప్రకటించడానికి మరింత ఎక్కువ సమయమే తీసుకున్నాడు. రిలీజ్కు నెలన్నర ముందు.. ఇప్పుడు ఆ సస్పెన్సుకు తెరపడింది. ఈ సినిమాకు ‘స్కంద’ అనే టైటిల్ ఖరారు చేశాడు బోయపాటి. ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ ఎవ్వరూ ఊహించనిదే. బహుశా ఇది హీరో పేరే అయ్యుండొచ్చు. ఇలాంటి పేర్లు చాలా అరుదుగా పెట్టుకుంటారు. టైటిల్ ప్రకటన సందర్భంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
అందులో రామ్ ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించాడు. టైటిల్ను అచ్చం ‘అఖండ’ తరహాలోనే బోయపాటి డిజైన్ చేయించడం విశేషం. ‘సింహా’ సినిమా దగ్గర్నుంచి పరిశీలిస్తే.. బాలయ్యతో కాకుండా ఎవరితోనూ పెద్ద హిట్ కొట్టలేకపోయాడు బోయపాటి. రామ్ సినిమాతో ఆ నెగెటివ్ సెంటిమెంటును బ్రేక్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. రామ్ సరసన శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు దసరాకు అనుకున్నప్పటికీ.. అనుకున్న దాని కంటే నెల ముందే సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం.