‘బాహుబలి’ సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసి పేరు సంపాదించిన యువ నటుడు రాకేష్ వర్ర హీరోగా నటించిన సినిమా.. జితేందర్ రెడ్డి. ఒకప్పటి స్టూడెంట్ లీడర్, రాజకీయ నేత జితేందర్ రెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే సినిమా ఏడాది కిందటే పూర్తయినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే లేటెస్ట్గా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో.. ఈ చిత్రానికి ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ హీరో రాకేష్ వర్ర ఎమోషనల్ అయ్యాడు. చిన్న సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు సెలబ్రెటీస్ వస్తేనే వాటి గురించి జనాలకు తెలుస్తుందని.. కానీ తాను అడిగిన సెలబ్రెటీస్ ఎవ్వరూ ఈ సినిమా ఈవెంట్కు రాలేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
‘జితేందర్ రెడ్డి’ సినిమాలో నటిస్తుండగానే తాను నిర్మాతగా ‘పేకమేడలు’ అనే సినిమా చేశానని.. ఐతే ఎవరైనా బ్రాండ్ ఉన్న హీరో లేదా, నిర్మాత ఈ సినిమా చేసి ఉంటే ఏడాదిలో పూర్తయ్యేదని.. జనాలకు కూడా ఈ సినిమా గురించి తెలిసేదని.. కానీ తాను నిర్మాత కావడం వల్ల ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి మూడేళ్లు పట్టిందని.. కొత్తగా చేసిన ఈ సినిమా జనాల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయిందని రాకేష్ అన్నాడు. తాను ఈ సినిమా చేసి ఉండాల్సింది కాదేమో అనిపించిందని అతనన్నాడు.
ఇక ‘జితేందర్ రెడ్డి’ సినిమా విషయానికి వస్తే మొదట ఈ చిత్రానికి థియేటర్ల సమస్య తలెత్తిందని.. తర్వాత సెన్సార్ వాళ్లు ఆపేశారని.. అలా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని నవంబరు 8న రిలీజ్ చేయాలనుకున్నామని.. కానీ ఇప్పుడు సరైన థియేటర్లు దొరక్కపోవడం వల్ల రిలీజవుతుందా లేదా అన్న భయం కలుగుతోందని రాకేష్ ఆవేదన చెందాడు. సెలబ్రెటీస్ వచ్చి సపోర్ట్ చేస్తేనే జనంలోకి సినిమా వెళ్తుందని.. కానీ తాను నటించిన సినిమాలకు సంబంధించిన సెలబ్రెటీలను ఎవ్వరిని పిలిచినా ప్రమోషనల్ ఈవెంట్కు రాలేదని అతనన్నాడు. సినిమా తీయడం కంటే మార్కెట్ చేయడమే ఈ రోజుల్లో ముఖ్యమని.. ఫిలిం మేకర్స్ అందరికీ తాను ఇదే చెబుతానని.. ‘జితేందర్ రెడ్డి’ సినిమాను జితేందర్ రెడ్డి అభిమానులే ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని అతనన్నాడు.