రజినీకాంత్ పేరుకు తమిళ హీరో కానీ.. వివిధ భాషల్లో ఆయనకు భారీగా అభిమాన గణం ఉంది.
సౌత్ నుంచి ఇప్పుడు చాలామంది పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు రజినీ ఏం ప్లాన్ చేయకుండానే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
మన స్టార్లతో సమానంగా రజినీని ఆదరిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. మన ఇండస్ట్రీ జనాలకు సైతం రజినీ అంటే ఆరాధన భావమే. అందులో తాను కూడా ఒకడినని అంటున్నాడు అగ్ర దర్శకుడు సుకుమార్.
ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీపై తనకున్న అభిమానాన్ని చాటుకోవడమే కాదు.. ఆయనతో తనకున్న ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు సుక్కు.
అందరూ బాషా సినిమాతోనే రజినీ తెలుగులో పెద్ద స్టార్ అయ్యాడని అనుకుంటారని.. నిజానికి అంతకుముందే ఆయన సినిమాలు తెలుగులో చాలా బాగా ఆడేవని.. తన చిన్నతనంలో తనతో పాటు స్నేహితులందరం రజినీ స్టైల్‌ను అనుకరించడానికి ప్రయత్నించేవారమని సుక్కు తెలిపాడు.
తన ఆరాధ్య కథానాయకుల్లో ఒకడైన రజినీని తాను దర్శకుడు అయ్యాక కలిసే అవకాశం దక్కిందని సుక్కు వెల్లడించాడు.
‘ఆర్య’కు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన రత్నవేలు ద్వారా రజినీని కలిశానని.. అప్పుడు రజినీ ‘రోబో’ సినిమా చేస్తున్నాడని.. ఆ సినిమా సెట్‌కు వెళ్లి ఆయన్ని కలిశానని సుకుమార్ వెల్లడించాడు.
ఐతే మధ్య మధ్యలో షాట్‌కు వెళ్లి వస్తూ తిరిగి వచ్చి రజినీ తనతో మాట్లాడుతున్నారని.. ఐతే ఆయన్ని చూస్తున్నపుడు ఇది నిజమా కలా అన్న భావనలో తాను చేతులు కట్టుకుని నోట మాట రాకుండా ఉండిపోయానని తెలిపాడు సుక్కు.
‘ఆర్య’ సినిమాలో ఒక్కో సన్నివేశం గురించి ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయానని.. హీరో విలన్లతో ఫైట్ చేయకుండా ఒక్కో వస్తువును పగలగొట్టే సీన్ గురించి చాలా బాగా మాట్లాడారని.. ఐతే ఎంత సేపటికీ రజినీ కూర్చోమన్నా కూర్చోకుండా తాను నిలబడే ఉండగా.. ఆయన ఉన్నట్లుండి ఒక కుర్చీ తీసుకొచ్చి తన ముందు వేసి కూర్చో అనగానే భయంతో కూర్చున్నానని.. ఈ అనుభవం ఎప్పటికీ తన మనసులో అలా నిలిచిపోయిందని సుకుమార్ వెల్లడించాడు.