ఇటీవల హైదరాబాద్లో అట్టహాసంగా జరిగిన `రాబిన్ హుడ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. `మా వెంకీ , నితిన్ కలిసి వార్నర్ ని తీసుకొచ్చారు. అతడిని క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. వీడు మామూలోడు కాదండీ దొంగ ముండా కొడుకు.. రేయ్ వార్నర్. ఇదే నా వార్నింగ్` అంటూ స్టేజ్ పై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
వాడు.. వీడు.. అంటూ వార్నర్ ను రాజేంద్రప్రసాద్ ఏక వచనంలో సంభోదించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్టార్ క్రికెటర్ ను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ నెటిజన్లు రాజేంద్రప్రసాద్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా వార్నర్ ఇష్యూపై రాజేంద్రప్రసాద్ రియాక్ట్ అయ్యారు. తప్పైపోయిందంటూ సారీ చెప్పారు.
`డేవిడ్ వార్నర్ అన్నా, అతని క్రికెట్ అన్నా నాకెంతో ఇష్టం. అలాగే మన సినిమాలు, యాక్టింగ్ అంటే అతనికిష్టం. రాబిన్ హుడ్ షూటింగ్ సమయంలో మేము చాలా క్లోజ్ అయ్యాం. ఆ చనువుతోనే అనుకోకుండా అలా నోరు జారాను. నా మాట్లాలు మీ మనసుని బాధపెట్టినట్లయితే సారీ. నేను నిజంగా ఉద్దేశం పూర్వకంగా అలా మాట్లాడలేదు. ఏదేమైనా మీ అందరికీ మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. ఇటువంటి పొరపాటు మళ్లీ జరగదు` అంటూ రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.
కాగా, రాబిన్ హుడ్ విషయానికి వస్తే.. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నితిన్, శ్రీలీల జంటగా నటించారు. డేవిడ్ వార్నర్ ఒక స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన రాబిన్ హుడ్ మార్చి 28న రిలీజ్ కాబోతోంది.