మీడియాకు సోషల్ మీడియా తోడైంది. దీంతో.. ఊహలు ఎవరివైనా వాటిని నిజం చేసేంతవరకు వెళుతున్నాయి. అయితే.. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. ఇలాంటి వాటి విషయంలో జరిగిన నిర్లక్ష్యమే.. దుబ్బాకలో ఇటీవల ముగిసిన ఉప ఎన్నిక ఫలితంగా చెప్పాలి. దుబ్బాక ఓటర్లను బీజేపీ చాలా తెలివిగా తన వైపు తిప్పుకుంది.
దుబ్బాకలో తమపై జరిగిన మైండ్ గేమ్ ను తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షం అమలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. గడిచిన వారంలో చూస్తే.. వరద బాధితులకు పరిహారం ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ.. ఎన్నికల వేళ పరిహారం పంచాల్సిన అవసరం ఏముందని ఎన్నిక సంఘానికి బీజేపీ రథసారధి బండి సంజయ్ లేఖ రాసినట్లుగా పేర్కొంటూ ఒక పోస్టు వైరల్ అయ్యింది. పరిహారాన్ని పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణ అధికారపక్షం పరిహారాన్ని చెల్లించటం ఆపేసింది. దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, అది తాను రాసిన లేఖే కాదని.. కేసీఆర్ సృష్టించిన నఖిలీ లేఖ అని బండి సంజయ్ నిరూపిస్తూ కొన్ని ఆధారాలు బయటపెట్టారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం కూడా చేశారు.
తమకు వచ్చే రూ.10వేల మొత్తాన్ని అడ్డుకున్నది బండి సంజయ్ లేఖనే అన్న మాట విపరీతంగా వైరల్ కావటమే కాదు.. ప్రజలంతా బీజేపీని తిట్టుకునే పరిస్థితిని కల్పించాలనేది టీఆర్ఎస్ వ్యూహం. వాస్తవానికి బండి సంజయ్ అస్సలు లేఖ రాయలేదని చెబుతున్నారు. గులాబీ దళం చేసిన పనితో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇలాంటి వైరల్ న్యూస్ మరొకటి వేగంగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్.. వర్సెస్ రాజాసింగ్ మధ్య ఏదో తేడా కొట్టిందని.. వారిద్దరి మధ్య ఇప్పుడు పొసగటం లేదన్న ప్రచారం మొదలైంది.
ఈ సమాచారం విన్న వారంతా షాక్ తింటున్నారు. తెలంగాణ బీజేపీలో ముఖ్యమైన ఇద్దరి నేతల మధ్య గొడవలు మొదలయ్యాయా? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఇదేమీ నిజం కాదని.. గులాబీ దళం చేస్తున్న మైండ్ గేమ్ అని చెబుతున్నారు. అంతేకాదు.. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చారని.. దీనిపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇది కూడా ఫేక్ అని చెబుతున్నారు.
పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం.. ఏదో జరుగుతుందన్న భావన కలిగేలా చేయటం.. ఓటర్లను గందరగోళానికి గురి చేయటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. తాను చేయని వ్యాఖ్యల్ని తన పేరు మీద ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇదంతా పెద్ద కుట్రగా అభివర్ణించారు రాజాసింగ్. దీనిపై సైబర్ క్రైంలో కంప్లైంట్ చేస్తానని రాజాసింగ్ స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి బండి వర్సెస్ రాజాసింగ్ మధ్య ఏమీ లేకున్నా.. సమ్ థింగ్. సమ్ థింగ్ అన్నట్లుగా సాగుతున్న ప్రచారం కమలనాథుల్లో కలకలాన్ని రేపుతోంది.