తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర లేదు. రాజకీయ, మతపరమైన విషయాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజా సింగ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. హిందూ ధర్మ, గోవుల పరిరక్షణకు అవసరమైతే సొంతపార్టీతోనైనా కొట్లాడతానని చెప్పిన రాజా సింగ్ వ్యవహారశైలి అందరికీ తెలిసిందే. ఇలా, ఇప్పటివరకు రియల్ లైఫ్ లో కరుడుగట్టిన హిందూత్వవాదిగా పేరు తెచ్చుకున్న రాజా సింగ్…తాజాగా రీల్ లైఫ్ లోనూ అదే పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతోన్న చిత్రంలో రాజాసింగ్ శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజాసింగ్ వెల్లడించారు.శంభాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షణకు ఎన్నో త్యాగాలు చేశారని, ఔరంగజేబు తన చర్మం ఒలిచినా కూడా హిందూ ధర్మం కోసం రక్తం చిందించిన గొప్ప వ్యక్తి అని రాజాసింగ్ చెప్పారు.
అటువంటి మహనీయుడుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశం, ధర్మం కోసం ఏ విధంగా అయితే పోరాడారో.. శంభాజీ మహారాజ్ కూడా అంతకంటే ఎక్కువగా పోరాడారని, కానీ, ఆయన గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలియడం బాధాకరమని అన్నారు. ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ మహారాజ్ దాడి చేశారని, ఈ క్రమంలో 120 కోటలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
శంభాజీ జీవిత చరిత్ర చాలా గొప్పదని, ఆయన జీవిత కథపై సినిమా చేయాలని, అందులో తానే నటించాలని అనుకున్నానని చెప్పారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే వర్కవుట్లు కూడా మొదలు పెట్టానని, ఆ పాత్ర కోసం ఏకంగా చాలా బరువు తగ్గానని అన్నారు. మరాఠీ భాషలో శంభాజీ మహారాజ్ పై కొన్ని చిత్రాలు, డాక్యుమెంటరీలు ఉన్నాయని కానీ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం,తమిళ్, గుజరాతీ భాషలో లేవని అన్నారు. అందుకే, ఆ భాషలతో పాటు మరాఠీలోనూ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రాజాసింగ్ చెప్పుకొచ్చారు.