టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మార్మోగింది. తెలుగు సినిమా స్టామినాను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత జక్కన్నకే దక్కింది. ఇక, రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ తో మరో మెట్టుకు ఎదిగారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో అద్భుతంగా నటింపజేసిన రాజమౌళిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ముగ్గురిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని అంటున్నారు. అందుకే, టాలీవుడ్ లో అగ్రదర్శకుడిగా చలామణి అవుతున్న రాజమౌళి దగ్గర దర్శకత్వం నేర్చుకోవాలని ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రయత్నిస్తుంటారు. రాజమౌళిని తమ మార్గదర్శి అని అనుకుంటూ ఉంటారు. కానీ, తాను ఎవరికీ మార్గదర్శిని కాదు అంటూ రాజమౌళి తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు.
తాజాగా కెనడాలో జరిగిన టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ఎంత ఘనవిజయం సాధించినా తాను దర్శకుడిగా ఇంకా తొలి మెట్టుపైనే ఉన్నానని వినమ్రంగా చెప్పారు జక్కన్న. తాను మార్గదర్శిని అనుకోవడం లేదని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానని జక్కన్న అన్నారు. తాను మూలాలకు కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ అభిమానుల టేస్ట్ కు తగ్గట్లే తనతో పాటు అందరు భారతీయ దర్శకులు సినిమాలు తీస్తారని జక్కన్న చెప్పుకొచ్చాడు.
బాహుబలి సినిమా భారతీయులతో పాటు జపాన్ వాసులను గొప్పగా అలరించిందని, కానీ, ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పిస్తుందని తాను ఊహించలేదని చెప్పారు. వెస్ట్ ప్రేక్షకులకు భారతీయ సినిమాలు నచ్చవు అనే అభిప్రాయంతో ఉండేవాడినని, ఆర్ఆర్ఆర్ తర్వాత వారికి నచ్చేలా కూడా తాము సినిమాలు తీయగలమన్న విషయం అర్థమైందని అన్నారు.
gkphbu