ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 ముగింపు దశకు చేరుకుంది. జూన్ 3వ తేదీ మంగళవారం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. ఈ రెండు జట్టులు ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టోర్నీ గెలవలేదు. 18 సీజన్ల నుండి బెంగళూరు టీమ్ ను ఐపీఎల్ కప్ ఊరిస్తూనే ఉంది. ప్రతి సీజన్ కి ఈసారి కప్ మనదే అంటూ హామీ ఇవ్వడం.. ఆఖరిలో చేతులెత్తేసి ఇంటికి వెళ్లడం ఆర్సీబీకి ఆనవాయితీగా వస్తుంది. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్స్ చేరుకుని టైటిల్ ను గెలుచుకోలేకపోయిన ఆర్సీబీ.. ఇప్పుడు నాలుగో సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
ఐపీఎల్ 18వ సీజన్ ఇది.. అలాగే కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ఈ సెంటిమెంట్ ప్రకారం కచ్చితంగా ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందని అభిమానులు ఎంతో నమ్మకం గా ఉన్నారు. ఇక మరోవైపు ఎటువంటి అంచనాలు లేని పంజాబ్ కింగ్స్ టీమ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫైనల్స్ కు చేరుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించారు. 204 పరుగుల ఛేజింగ్ లో ఏమాత్రం తడబడలేదు. విన్నింగ్ షాట్ కొట్టాక కూడా కప్ గెలిచాకే సంబరాలు అన్నట్లుగా వ్యవహరించాడు.
ఇప్పటివరకు మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ చరిత్ర సృష్టించారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ కు చేర్చిన శ్రేయస్.. గత ఏడాది కోల్‌కతాను విజయం వైపు నడిపిండచంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇప్పుడు పంజాబ్ ను ముందుండి నడిపించి తొలి సారి ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. సో.. రేపు జరగబోయే మ్యాచ్ లో ఏ జుట్టు వైపు నిలబడాలో తెలియక క్రికెట్ లవర్స్ తెగ కన్ఫూజన్ అవుతున్నారు.
తాజాగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను ఉద్ధేశిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. `బుమ్రా మరియు బౌల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్ బౌండరీకి మార్గనిర్దేశం చేసిన అయ్యర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. గతంలో ఢిల్లీ టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లినా శ్రేయస్ ను వదిలేశారు.. కోల్‌కతాను ట్రోఫీ వైపు నడిపించినా వదిలేశారు. 11 సంవత్సరాల తర్వాత యువ పంజాబ్‌ను ఫైనల్‌కు నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం ట్రోఫీకి అతను అర్హుడు. అలాగే కోహ్లీ సంవత్సరాల తరబడి ప్రదర్శన ఇస్తున్నాడు… వేల పరుగులు సాధిస్తున్నాడు. అతను కూడా ట్రోఫీకి అర్హుడు. కాబట్టి రేపు రిజల్ట్ ఏదైనా హార్ట్ బ్రేక్ తప్పదు` అంటూ జక్కన్న ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ గా మారింది.