దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ ఆర్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ దక్కడంతో భారతీయులంతా గర్విస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డు లభించడంతో తెలుగు సినీ ప్రముఖులతో పాటు పలువురు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందని మోడీ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ తో పాటు దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రస్తావిస్తూ చిత్ర బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఇక, ఈ సినిమాకు పనిచేసిన సిబ్బందిని మెచ్చుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇదొక చారిత్రక విజయమని చిరు ప్రశంసించారు. ‘ఆర్ఆర్ఆర్ టీమ్ కు నా అభినందనలు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్ ల సంబరమే ‘‘నాటు నాటు’’ పాట. దేశంతో పాటు ప్రపంచం మొత్తం మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. తారక్, రామ్ చరణ్, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, దానయ్యగారు, డీవీవీ మూవీస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు అభినందనలు’ అంటూ చిరు ట్వీట్ చేశారు. కీరవాణిని అభినందిస్తూ జూనియర్ ఎన్టీఆర్, ఏఆర్ రెహమాన్, క్రిష్ కూడా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి జక్కన్న కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందని, దాన్ని స్క్రిప్ట్ గా డెవలప్ చేసే పనిలో ఉన్నానని ధ్రువీకరించారు. బలవంతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నామని, కానీ, పాశ్చాత్య దేశాల్లోనూ ఆర్ఆర్ ఆర్ కు మంచి ఆదరణ చూసిన తర్వాత కొన్ని వారాల క్రితం నాన్న, కజిన్‌తో మళ్లీ చర్చించగా అప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించామని చెప్పారు.