ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెండి తెరపైకి వరుసగా రాజకీయ సినిమాలు వస్తున్నాయి. గత వారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి.వి.రాఘవ్ ఆ సినిమా బాగానే తీసినా.. అది మరీ ఏకపక్షంగా ఉండి జగన్ అంత ఉత్తమ రాజకీయ నేత ప్రపంచంలో మరొకరు లేరు, ఆయన రాజకీయ ప్రత్యర్థులంతా పరమ దుర్మార్గులు అన్నట్లు చూపించడంతో సామాన్య ప్రేక్షకులకు అది రుచించలేదు.
ప్రస్తుత పొలిటికల్ మూడ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బోల్తా కొట్టినట్లు భావిస్తున్నారు. ఇంతలో వైఎస్ జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. అమరావతి రైతుల కష్టాల మీద తీసిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా లైన్లోకి వచ్చింది.
ఈ సినిమా ఎప్పుడు చిత్రీకరణ జరుపుకుందో కూడా తెలియదు. నేరుగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ స్ట్రైకింగ్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ హాట్ టాపిక్ అయింది.
వైసీపీ అనుకూల సినిమాలు యాత్ర-2, వ్యూహం సినిమాలకు కలిపి వచ్చిన వ్యూస్ లైక్స్ కంటే ఒక్క రోజు వ్యవధిలోనే దీనికి ఎక్కువ వ్యూస్, లైక్స్ రావడం విశేషం.
దీంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘రాజధాని ఫైల్స్’ రిలీజైంది. ఐతే కోర్టు స్టే పేరుతో ఏపీలో పలు చోట్ల మార్నింగ్ షోలకు బ్రేక్ వేసేశారు. తెలంగాణలో మాత్రం షోలు యధావిధిగా నడిచాయి. చాలామంది సినిమా చూశారు. ఇక సినిమా అంచనాలకు తగ్గట్లు ఉందా అంటే.. లేదు అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. అమరావతి రైతుల బాధను ఆరంభంలో హృద్యంగానే చూపించారు కానీ.. క్రమ క్రమంగా సినిమా గాడి తప్పింది. చాలా సీన్లు ఎగ్జాజరేటెడ్ అనిపించడం.. డ్రామా సరిగా పండకపోవడం మైనస్ అయింది. రైతుల కంటే ఇందులో హీరో పాత్ర చేసిన వ్యక్తిని ఎలివేట్ చేసే క్రమంలో వాస్తవ విరుద్ధమైన సీన్లు పెట్టడంతో సినిమా దెబ్బతింది.
వైఎస్ జగన్ పాత్ర చుట్టూ కొన్ని సెటైరిక్ సీన్లు బాగానే పేలాయి కానీ.. ఆ పాత్రను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. వాస్తవ సన్నివేశాలను కొంచెం ఎక్కువ చేసి చూపిస్తే జనాలకు ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యేది. కానీ చాలా చోట్ల ఎగ్జాజరేషన్ వల్ల, హీరో పాత్ర వల్ల సినిమా గాడి తప్పింది. ట్రైలర్ చూసి ఎంతో ఊహించుకున్న ప్రేక్షకులు.. సినిమా చూసి నిరాశ చెందడం ఖాయం. కాకపోతే సినిమాలోని కొన్ని సన్నివేశాలు మాత్రం ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.