ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ఘటన బాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాపై పలువురు అప్ కమింగ్ నటీనటులు, ఆర్టిస్టులు, యువతులు తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా అవకాశఆల కోసం ముంబైకి వచ్చిన యువతులకు రాజ్‌కుంద్రా మాయమాటలు చెప్పి పోర్న్ రొంపిలోకి దింపి కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే 2 నెలల క్రితం పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన పోలీసులు….అతడిపై 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. ఈ కేసులో రాజ్‌కుంద్రా సహా పలువురిని జులై 19న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని, ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా పోలీసులే తనను కేసులోకి లాగారని రాజ్ కుంద్రా సంచలన ఆరోపణలు చేశారు. అందుకే, తనకు బెయిల్ ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ నేపథ్యంలోనే రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు…తాజాగా అతడికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల పూచీకత్తుపై రాజ్ కుంద్రాకు ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కుంద్రాతో పాటు అతడి దగ్గర ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ర్యాన్ థోర్పేకి కూడా బెయిల్ వచ్చింది. కాగా, రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పా శెట్టి తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా కేసు నేపథ్యంలో శిల్పా శెట్టి పలు షోల నుంచి కూడా తప్పుకుంది.