తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను దొరలు-ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. “రాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఎటుంటారో నిర్ణయించుకోండి“ అని రాహుల్ పిలుపునిచ్చారు. ములుగు లో తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్లుగా దొరల పాలన కొనసాగుతోందంటూ.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మాకు – దొరలకు తేడా చూడండి
తమకు(కాంగ్రెస్ నేతలకు), దొరలకు(కేసీఆర్ కుటుంబం) తేడాను చూడాలని రాహుల్‌గాంధీ కోరారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, సాకారం చేసిందని, దీనిని ప్రపంచమంతా చూసిందన్నారు. సాధారణంగా తమకు నష్టం కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోవని, కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని, ఏపీలో పార్టీ తునాతునకలు అవుతుందని తెలిసి కూడా తెలంగాణ కోసం పార్టీని ఫణంగా పెట్టిందన్నారు. అయితే.. దొర.. కేసీఆర్ మాత్రం ఎన్నో హామీలు ఇచ్చి.. వాటినిపూర్తిగా అటకెక్కించారని రాహుల్ దుయ్యబట్టారు.
తెలంగాణ వస్తే.. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ చేశారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చారా? అని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, లక్ష రూపాయలు రుణమాఫీ వంటి అనేక హామీలు గుప్పించి.. ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చినట్టు రాహుల్ చెప్పారు.
రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామని తెలిపారు. రూ.25 లక్షల వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నామన్నారు. రాజస్థాన్‌లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా ఉందని తెలిపారు. “దేశంలోనే వరిధాన్యం కొనుగోలు ధర ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువ. కర్ణాటక వెళ్లి చూడండి.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రతి నెలా మహిళలకు వారి అకౌంట్లోకి ఉచితంగా డబ్బు పడుతోంది“ అని రాహుల్ వెల్లడించారు.
బీజేపీకి వేసినట్టే!
రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి ఓటేస్తే.. ఆ ఓటు నేరుగా బీజేపీకి వేసినట్టేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. బీఆర్ ఎస్‌కు ఓటేసినా.. బీజేపీకి పడుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు కేసీఆర్ తరఫున ఎంపీలు మద్దతు ఇచ్చారని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ ఎస్, బీజేపీ, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మళ్లీ తెలంగాణ కష్టాల్లోకి జారుకుంటుందని హెచ్చరించారు