కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ పాదయాత్ర చేయలేని చోట ఉపయోగిస్తున్న బస్సుపై తెలంగాణ రాజకీయాలలో రచ్చ జరుగుతోంది. తెలంగాణలో ఆ బస్సు రిజిస్టర్ కావడంతో కాంగ్రెస్ నేతలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగుతున్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవకముందే తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లు వాడేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే, అది తెలంగాణ ప్రజల సొమ్ము కాదని, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి ఆ బస్సును గిఫ్ట్‌గా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
అంతేకాదు, ఆ బస్సు నంబర్ TS 09 GF 8055 కు కొత్త బాష్యం చెబుతున్నారు. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని 09 అంటే రేవంత్ లక్కీ నంబర్ అని… GF అంటే గాంధీ ఫ్యామిలీ అని.. 8055 అంటే BOSS అని చెబుతున్నారు. ఇక, భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లిన విషయం మరిచిపోవద్దంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ రెడ్డి పార్టీపై అభిమానంతో ఇచ్చిన బస్సు ప్రభుత్వ సొమ్ముతో కొన్నారనడం సరికాదని అంటున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మక యాత్రకు తెలంగాణకు చెందిన బస్సు ఉపయోగపడడం గర్వకారణంగా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక పార్టీకి చెందిన సభ్యుడు ఆ పార్టీపై అభిమానంతో బస్సు ఇస్తే ప్రభుత్వానికి నష్టం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకొస్తే బీహార్, పంజాబ్, యూపీ వారికి తెలంగాణ సొమ్ము పంచడం తప్పు అంటున్నారు. 500 కార్లు వేసుకొని మహారాష్ట్రలో ప్రచారానికి బీఆర్ఎస్ నేతలు పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పంజాబ్ రైతులకు, రాజస్థాన్ వారికి కోట్ల రూపాయల తెలంగాణ ప్రజాధనాన్ని పంచి పెట్టిన గత పాలకులను ఏమనాలని నిలదీస్తున్నారు.