ఆయన మామూలు వ్యక్తి కాదు. కాలం.. ఖర్మం కలిసి రాలేదు కానీ.. లేదంటే దేశ పాలనా చక్రాన్ని తిప్పే ఫ్యామిలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. సింఫుల్ గా కనిపించే రాహుల్ గాంధీ మాస్ కు పెద్దగా కనెక్టు కాలేదు. కానీ.. అతగాడి చర్యలు చూసినప్పుడు.. సాదాసీదా ప్రజలు ఇట్టే కలిసే టాలెంట్ యువరాజులో ఎక్కువే. గతంలో గిరిజన కుటుంబాల వారింటికి వెళ్లి వారితో కలిసి భోజనం చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే.. ఆ పర్యటనను తనకు తగ్గట్లుగా.. తన ఇమేజ్ ను భారీగా పెంచుకునేలా చేసుకోవటంలో ఆయన ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో తమిళనాడులో జోరుగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. తమిళుల మనసుల్ని దోచుకునేందుకు వీలుగా రాహుల్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన పని.. కొందరు ఔత్సాహికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇంతకీ రాహుల్ ఏం చేశారు? అన్న విషయంలోకి వెళితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.పుదుకొట్టై జిల్లాలోని చిన్న వీర మంగళం గ్రామానికి సంబంధించి ఒక యూ ట్యూబ్ చానల్ చాలా ఫేమస్. దీనికి పెద్ద ఎత్తున సబ్ స్క్రైబర్లు ఉన్నారు. దీన్ని నిర్వహిస్తున్న ఏ యూత్ గ్రూప్ కాదు. ఆ గ్రామానికి చెందిన రైతులు దీన్ని నిర్వహిస్తుంటారు. గ్రామీణ వంటకాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దీంతో.. వారు మిగిలిన వారికి భిన్నంగా ఉండటమే కాదు.. పెద్ద ఎత్తున గుర్తింపును పొందారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాము చేసే వంటకాల వీడియోలు పాపులర్ అయి దాని ద్వారా యూట్యూబ్ ఇస్తున్న ఆదాయాన్ని వారు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
దీంతో.. వారిని వెతుక్కుంటూ వెళ్లారు రాహుల్ గాంధీ. వారిని కలిసి.. వారితో మాట్లాడటమే కాదు.. వారు తయారు చేసిన పుట్టగొడుగుల బిర్యానీ రుచిని అస్వాదించారు. వారితో పాటు కలిసి నేల మీద కూర్చొని.. అరిటాకులో భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ కొత్త తరహాలో సాగింది. రైతులను ఉద్దేశించి మీ లక్ష్యం ఏమిటని రాహుల్ అడగ్గా.. విదేశాల్లోనూ తమ వంటల్ని చేయాలనుకున్నట్లు చెప్పారు.ఎక్కడా అని అడిగితే అమెరికా.. మలేషియా.. చైనా అంటూ తమ విష్ లిస్ట్ లో ఉన్న దేశాల పేర్లు చెప్పారు. అమెరికాలో ఎక్కడ? అన్న ప్రశ్నకు మాత్రం వారు సమాధానం లేదు. దీనికి స్పందించిన రాహుల్.. అమెరికాలో తన స్నేహితుడు శ్యామ్ పిట్రోడాకు చెబుతానని.. అక్కడకు వెళ్లొచ్చన్నారు. ఊహించని రీతిలో వరాన్ని ఇవ్వటం.. ఇచ్చింది రాహుల్ గాంధీ కావటంతో వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. చూస్తుంటే.. రాహుల్.. తమిళులతో మమేకం కావటం.. వారిలో తాను ఒకడినన్న భావనను భిన్నమైన తీరులో ప్రదర్శిస్తున్న వైనం రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.