జగన్ సీఎం అయిన తర్వాత విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాగా వేసిన సంగతి తెలిసిందే. విశాఖలో సాయిరెడ్డి భూదందాలు, కబ్జాల వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆ కారణాలతోనే సాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారన్న టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా..ఈ రోజు జరిగిన విశాఖ గర్జన సభకు ఉత్తరాంధ్రను కొద్దికాలం పాటు ఏలిన సాయిరెడ్డి హాజరవుకావాలి. కానీ, అలా జరగలేదు.
దీంతో, విశాఖ గర్జనకు సాయిరెడ్డి ఎందుకు రాలేదని వైసీపీ రెబల్ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పేపర్, ఛానల్ పెట్టుకునే పనిలో ఆయన బిజీగా ఉన్నారేమోనని రఘురామ సెటైర్లు వేశారు. ఆ సభ ఫెయిలైందని, వైసీపీ నేతలు డబ్బా కొట్టుకోవడానికే పరిమితమయిందని ఎద్దేవా చేశారు. కాళ్లరిగేలా నడుస్తున్న అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదని మండిపడ్డారు.
ఏపీలో మూడు రాజధానులను అభివృద్ధి చేస్తామంటున్న జగన్…కనీసం రోడ్లు కూడా వేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసు సంగతేంటో తేల్చలేని స్థితిలో ఉన్న జగన్ చర్యలు ప్రజలకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని దుయ్యబట్టారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని, 3 రాజధానులకు మద్ధతు పేరుతో ముందు కొందరు…ఆ తర్వాత అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి అసెంబ్లీని రద్దు చేస్తారని జోస్యం చెప్పారు.
వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం వుందని.. మూడు ముక్కలాట తప్ప మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం చేసిందేమి లేదని ఆయన విమర్శించారు. 3 రాజధానులకు మద్ధతుగా ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించిన వైనంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.